పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన బాలకృష్ణనుఅభినందించిన కిషన్‌రెడ్డి !

Telugu Lo Computer
0


ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా బాలకృష్ణ నివాసానికి వెళ్లి కిషన్‌రెడ్డి అభినందించారు. సినిమా, రాజకీయ రంగాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 15 ఏళ్లుగా బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌గా వేలాది మందికి వైద్య సేవలందించారని కొనియాడారు. అనేక రంగాల్లో విశేష సేవలందించిన బాలకృష్ణకు పద్మ భూషణ్‌ ప్రకటించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పద్మభూషణ్‌ అవార్డు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా బాలకృష్ణ అన్నారు.''అనేక సందేశాత్మక సినిమాలు చేశాను. క్యాన్సర్‌ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి వైద్యం అందించాం. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. నా సేవల్ని గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నా వెనుక ఎంతో మంది బలం, బలగం, అభిమానగణం ఉన్నారు. హిందూపురం ప్రజానీకానికి ధన్యవాదాలు. ఎన్టీఆర్‌ తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఎన్టీఆర్‌ నాకు తండ్రి మాత్రమే కాదు.. నా గురువు కూడా. ఈ అవార్డు నాలో మరింత స్ఫూర్తిని నింపుతుందని భావిస్తున్నా. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కిషన్ రెడ్డికి నా విన్నపం. ఇది నా ఒక్కడి కోరిక కాదు.. తెలుగు ప్రజల కోరిక. పద్మభూషణ్‌ను ఒక బిరుదుగా కంటే బాధ్యతగానే భావిస్తున్నా. ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నాం. నా అభిమానులు కూడా నా నుంచి ఏమీ ఆశించరు. నేను చేసే సినిమాలు, మంచి పనులే వారు ఆశిస్తారు. చేస్తున్న మంచి పనులు మరింత కొనసాగించేలా ఈ అవార్డు ప్రోత్సాహకరంగా ఉంటుంది'' అని బాలకృష్ణ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)