కాలితో తన్ని, కడుపుపై కొట్టాడు: స్వాతి మాలీవాల్‌

Telugu Lo Computer
0


ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌పై ఢిల్లీ  ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు బిభవ్‌ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. వాంగ్మూలంలో స్వాతి సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. అతడు తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆప్‌ ఎంపీ ఆరోపించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పోలీసు బృందం గురువారం మాలీవాల్‌ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా దాడి ఘటనను ఎంపీ పోలీసులకు వివరించారు. ''సీఎం నివాసంలో బిభవ్‌ కుమార్‌ నాపై దాడికి దిగాడు. చెంపపై కొట్టి, కాలితో తన్నాడు. కర్ర తీసుకుని బాదాడు. కడుపుపైనే గాక సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశా'' అని స్వాతి పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 13న కేజ్రీవాల్‌ నివాసంలోనే ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీన్ని ఆప్‌ కూడా ధ్రువీకరించి, బిభవ్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనిపై స్వాతి గురువారం తొలిసారిగా స్పందించారు. తనకు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని భాజపాకు విజ్ఞప్తి చేశారు. స్వాతి మాలీవాల్‌పై దాడి నేపథ్యంలో ఆప్‌ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు. ఆ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని అన్నారు. ''స్వాతిపై దాడి జరిగింది. కేజ్రీవాల్‌ చెప్పింది చేయడమే బిభవ్‌ పని. ఆ వ్యక్తి దురుసు ప్రవర్తనను నేనూ సహించాల్సి వచ్చింది. అక్కడ కొట్టడం మామూలే. ప్రశాంత్‌ కుమార్‌, యోగేంద్ర యాదవ్‌ లాంటి వాళ్లను బౌన్సర్లలతో గెంటేశారు. ఈసారి హద్దులు దాటారు. పీఏతో ఓ మహిళను కొట్టంచడం తగినదేనా? ఇంత జరిగాక కేజ్రీవాల్‌ సీఎం పదవిలో కొనసాగడం సరికాదు. ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి'' అని ఆమె డిమాండ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)