గత ఆర్థిక సంవత్సరానికి (2023-24) సంబంధించిన రిటర్నుల ఫైలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఐటీఆర్ 1, 2, 4, 6 ఫారాలను ఇ-పైలింగ్ పోర్టల్‌లో ఏప్రిల్ ఒకటి నుంచే ఆదాయపు పన్ను శాఖ అందుబాటులో ఉంచింది. దీంతో ఆర్థిక సంవత్సరం తొలిరోజు నుంచే రిటర్నుల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. గత నాలుగు రోజుల్లోనే 23 వేల రిటర్నులు దాఖలయ్యాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. ''పన్ను చెల్లింపుదారులు సాధారణంగా వినియోగించే ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4ను ఏప్రిల్ 1 నుంచే ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చాం. ఐటీఆర్-6 వినియోగించి కంపెనీలు సైతం రిటర్నులు దాఖలు చేసే అవకాశం కల్పించాం'' అని సీబీడీటీ పేర్కొంది. వ్యక్తుల వార్షికాదాయం రూ.50 లక్షలు మించనివారు ఐటీఆర్- 1 (సహజ్)ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వేతనం, వడ్డీ ద్వారా వచ్చే ఆదాయంతో పాటు వ్యవసాయం మీద రూ.5 వేల వరకు ఆదాయం వచ్చే వారు ఈ పత్రాన్ని వినియోగించాలి. ఏదైనా కంపెనీకి డైరెక్టరుగా విధులు నిర్వర్తిస్తున్నా, అన్‌లిస్టెడ్ ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వ్యక్తులకు ఐటీఆర్-1 వర్తించదు. అదేవిధంగా రూ.50లక్షల్లోపు ఆదాయం కలిగిన హిందూ అవిభాజ్య కుటుంబాలు, సంస్థలు ఐటీఆర్- 4 (సుగమ్)ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఐటీ ఫారాలను గతేడాది డిసెంబర్ 22నే సీబీడీటీ నోటిఫై చేసింది. ఐటీఆర్-6ను ఈ ఏడాది జనవరి 24న, ఐటీఆర్-2ను జనవరి 31న నోటిఫై చేసింది. ఐటీఆర్ 3, 5, 7 త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీబీడీటీ పేర్కొంది.
4 రోజుల్లో 23 వేల రిటర్నులు దాఖలు !
April 04, 2024
0
Tags