ప్రధాన మంత్రి ఫసల్ (పంట) బీమా పథకంతోపాటు పలు బీమా ఉత్పత్తులు, సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడానికి సారథి అనే పోర్టల్‌ను కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా గురువారం ప్రారంభించారు. పంటల బీమా పథకానికి సంబంధించి రైతుల ఫిర్యాదులను పరిష్కరించడానికి కిసాన్ రక్షక్ పోర్టల్‌నూ, 14447 నంబరు హెల్ప్ లైన్‌నూ ప్రారంభించారు. ఫసల్ బీమా, సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం, కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి రైతులకు సమాచారం అందించే ఏర్పాటు చేశారు. ఏక గవాక్ష సారథి పోర్టల్ రైతులకు డిజిటల్ పంథాలో పంట బీమా పొందే సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పోర్టల్‌లో బీమా పథకాలను పరిశీలించి, కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ పద్ధతిలో ప్రీమియం చెల్లించవచ్చు. సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సారథి పోర్టల్‌లో మొదటి దశలో ఆసుపత్రి నగదు, వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాలను కల్పిస్తారు. రెండో దశలో ఆరోగ్య, దుకాణ, గృహ బీమా సౌకర్యాలను అందిస్తారు. మూడో దశలో పంటల బీమాకు భిన్నమైన ట్రాక్టరు, ద్విచక్ర వాహన, పశు బీమా వంటివి అందిస్తారు. దేశంలో పశు గణనను చేపట్టేందుకు కేంద్ర పశు సంవర్ధకశాఖ సిద్ధమైంది. జనాభా లెక్కల మాదిరిగానే ఈ పశు గణనను సెప్టెంబరు- డిసెంబరు మధ్య చేయాలని నిర్ణయించింది. మొబైల్ టెక్నాలజీతో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ చేపట్టనున్నారు. పలు జాతులకు చెందిన పెంపుడు జంతువులు, పక్షులు, ఇతర జీవజాతులు వయసు, లింగ తదితర వివరాలను సేకరించి డిజిటలైజేషన్ చేస్తారు. దేశంలో తొలిసారి 1919లో మొదలైన పశు గణన ప్రతీ ఐదేళ్లకోసారి జరుగుతుంటుంది. జాతీయ రహదారులపై జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్లను చేపట్టేందుకు కన్సల్టెంట్‌ను నియమించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తొలుత దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని వెల్లడించారు.
ప్రధాని పంటల బీమాకు ప్రత్యేక పోర్టల్
February 09, 2024
0
Tags