ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఐదేళ్ల బాలికని మెలకువలో ఉంచి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. ఇలాంటి సర్జరీ చేయడం ప్రపంచంలోనే మొదటిసారి. ఎయిమ్స్ ఆస్పత్రి ప్రకటన ప్రకారం.. ఒకటో తరగతి చదువుతున్న అక్షిత మూర్ఛతో బాధపడుతోంది. ఆమెకు MRI నిర్వహించిన వైద్యులు మెదడు ఎడమ భాగంలో కణుతులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తొలగించేందుకు ఎయిమ్స్ న్యూరో సర్జరీ ప్రొఫెసర్ దీపక్ గుప్తా బృందం రంగంలోకి దిగింది. రోగిని మెలకువగా ఉంచి సర్జరీ చేయడాన్ని 'అవేక్ క్రానియోటమీ' అంటారు. ఇలా చేయడం ద్వారా పూర్తిగా కణుతులను తీసి వేయడంతో పాటు.. నరాల సంబంధిత లోపాలను నివారించేందుకు తోడ్పడుతుంది. నొప్పి కనీస స్థాయిలో ఉండేలా వైద్య బృందం జాగ్రత్త పడింది. చిన్నారికి మత్తు మందు ఇవ్వడం సహా సర్జరీని మూడు గంటల్లో పూర్తి చేశారు. ఆపరేషన్ మధ్యలో మూర్ఛ రాకుండా మెదడు ఉపరితలంపై ఐస్ కోల్డ్ సెలైన్‌ను ఉపయోగించినట్లు వైద్యులు పేర్కొన్నారు. సర్జరీ పూర్తయ్యే వరకు చిన్నారి మెలకువలోనే ఉందని.. తాము చూపిన ప్రధాని మోదీ చిత్రాన్ని గుర్తుపట్టిందని తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. సోమవారం ఆమె డిశ్చార్జ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. మెలకువగా ఉండి సర్జరీ చేయించుకున్న అతి పిన్న వయస్కురాలిగా అక్షిత రికార్డు సృష్టించింది.
చిన్నారి స్పృహలో ఉండగానే బ్రెయిన్ సర్జరీ !
January 07, 2024
0
Tags