నకిలీ కరెన్సీ గుట్టు రట్టు చేసిన ఎన్‌ఐఏ !

Telugu Lo Computer
0


నాలుగు రాష్ట్రాల్లో శనివారం దాడులు నిర్వహించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) నకిలీ కరెన్సీ నోట్ల రాకెట్‌ను చేధించింది. నకిలీ భారత కరెన్సీ నోట్లను, ప్రింటింగ్ మిషన్లు, ప్రింటింగ్ పేపర్లను స్వాధీనం చేసుకుంది. అలాగే మొత్తం రూ.6,600 నకిలీ కరెన్సీ నోట్లను కూడా ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనపరచుకున్నారు. నకిలీ కరెన్సీ అంతా రూ.500, రూ.200, రూ.100 నోట్ల రూపంలో ఉంది. భారత శిక్షాస్మృతిలోని(ఐపీసీ) సంబంధిత సెక్షన్ల కింద నవంబర్ 24న నమోదైన కేసుపై ఎన్‌ఐఏ ఈ చర్య తీసుకుంది. సరిహద్దుల గుండా నకిలీ కరెన్సీ నోట్లను రవాణా చేయడానికి, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో నకిలీ కరెన్సీ చలామణిని ప్రోత్సహించడానికి నిందితులు కుట్రపన్నినట్టు ఎన్‌ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో నిందితులను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఐఏ అధికారులు శనివారం దాడులు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్‌ఐఏ బృందాలు వివిధ రాష్ట్రాల్లోని కీలక నిందితుల ఆవరణలో తనిఖీలు చేపట్టాయి. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల రాహుల్ తానాజీ పాటిల్, యవత్మాల్ జిల్లాలో గల శివ పాటిల్, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలో గల వివేక్ ఠాకూర్, కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో గల మహేందర్, బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో గల శశి భూషణ్ ఇంటి నుంచి నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శివపాటిల్ అనే వ్యక్తి మరికొంతమందితో కలిసి మన దేశంలో చలామణి చేయడానికి పొరుగు దేశాల నుంచి నకిలీ కరెన్సీ, ప్రింటింగ్ మిషన్లను సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మహేందర్ ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ నోట్లను సరఫరా చేస్తానని హామీ ఇచ్చిన రాహుల్ తానాజీ పాటిల్, మోసపూరితంగా పొందిన సిమ్ కార్డులను ఉపయోగించి చెల్లింపులు జరుపుతున్నట్లు తదుపరి విచారణలో తేలింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)