మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల వరుస మరణాల సంఘటన మరువక ముందే ఛత్తీస్‌గఢ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి వెలుగులోకి వచ్చింది. రోగి సెలైన్ బాటిల్‌ను ఒక బాలుడు చేత్తో పట్టుకుని నిల్చున్నాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. అభన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రోగులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా లేవు. బెడ్లు, వీల్ చైర్లు, సెలైన్ స్టాండ్లు, స్ట్రెచర్లు వంటివి కూడా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ఒక మహిళా రోగి ఆసుపత్రి కుర్చీలో కూర్చొని ఉండగా ఆమెకు ఎక్కిస్తున్న సెలైన్ బాటిల్‌ను ఒక బాలుడు చేతితో పట్టుకున్నాడు. దాని కోసం ఆ చిన్నారి పలు గంటలపాటు నిల్చొని ఉన్నాడు. కాగా, ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంపై పలువురు మండిపడ్డారు.
ఛత్తీస్‌గఢ్ ఆసుపత్రిలో రోగి సెలైన్ బాటిల్ చేత్తో పట్టుకున్న దుస్థితి !
October 07, 2023
0
Tags