చట్ట రూపం దాల్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు !

Telugu Lo Computer
0


లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. దీంతో ఇది చట్ట రూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్‌ బిల్లును 'నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సెప్టెంబర్‌ 19న లోక్‌సభలో, సెప్టెంబరు 21న రాజ్యసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ బిల్లును రాష్ట్రపతి తాజాగా ఆమోదించడంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. అయితే, ఈ చట్టం ఇప్పుడే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జనగణన, డీలిమిటేషన్‌ తర్వాత ఈ చట్టాలు అమల్లోకి తీసుకురానున్నట్లు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభకు తెలిపారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లును తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)