భారత్- పాక్ సరిహద్దులో పంజాబ్‌లోని అమృత్‌సర్ సెక్టార్‌లోకి ప్రవేశించిన ఓ డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం కూల్చివేసింది. ఆ డ్రోన్‌తో పాక్ వైపు నుంచి మాదక ద్రవ్యాలను భారత్ భూభాగంలోకి విడిచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం పాకిస్థాన్ వైపు నుంచి ఓ డ్రోన్ భారత భూభాగంలోకి వస్తున్నట్లు గమనించిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దానిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్ నుంచి ఏదో వస్తువు కిందపడిపోయినట్లు గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా, ఓ బాటిల్‌లో హెరాయిన్‌గా భావిస్తున్న మాదక ద్రవ్యాలు లభ్యమైనట్లు తెలిపాయి. అంతకు ముందు పంజాబ్ పోలీసులతో కలిసి బీఎస్‌ఎఫ్ సరిహద్దు కంచె వెంబడి ఉన్న పొలాల్లో తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో కూలిన డ్రోన్‌తోపాటు కూల్‌డ్రింక్ బాటిల్‌లో మాదక ద్రవ్యాలు లభ్యమైనట్లు బీఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ రెండు ఘటనల్లో కిలో హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. డ్రోన్లు చైనాలో తయారైనవిగా గుర్తించారు. సరిహద్దు వెంబడి మాదక ద్రవ్యాల సరఫరాను ఎప్పటికప్పుడు కట్టడి చేస్తున్నామని బీఎస్‌ఎఫ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో డ్రోన్‌ల ద్వారా జరిగే ఆయుధ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు డ్రోన్ సాంకేతికత, యాంటీ-డ్రోన్ నిపుణులను సరిహద్దుల వెంబడి నియమించనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో తెలిపారు.
డ్రోన్లతో భారత్‌లోకి మాదక ద్రవ్యాలు !
September 29, 2023
0
Tags