సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు సమక్షంలో మేనేజ్మెంట్, 14 కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు ఫలించాయి. ఇందులో ఏడో దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను అక్టోబర్ 28న నిర్వహించాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. 22న మరోసారి సమావేశమై, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. ఆ రోజే నామినేషన్లు, గుర్తుల కేటాయింపు, ఓట్లు లెక్కింపు అంశాలపై క్లారిటీ రానుంది. సోమవారం జరిగిన మీటింగ్‌లో డిప్యూటీ సీఎల్సీ డి.శ్రీనివాసులు, సింగరేణి డైరెక్టర్(ఫైనాన్స్, పా) బలరాంనాయక్, పర్సనల్ జీఎం హనుమంతరావు, కార్మిక సంఘాల నుంచి మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్య, వి.సీతారామయ్య, ఎస్.నర్సింహారెడ్డి, యాదగిరి సత్తయ్య, టి.రాజారెడ్డి, మంద నర్సింహారావు, టి.శ్రీనివాస్, త్యాగరాజన్, ఐ.కృష్ణ, శ్రీనివాసరెడ్డి, జి.రాములు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో షెడ్యూల్వెంటనే ప్రకటించాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ పట్టుబట్టాయి. దీనిని మెజార్టీ సంఘాలు వ్యతిరేకించాయి. 2017, అక్టోబర్5న చివరిసారి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీబీజీకేఎస్ గెలిచింది. నాలుగేండ్ల కాలపరిమితితో నిర్వహించిన ఆ ఎన్నికల గడువు 2021, అక్టోబర్‌నాటికి పూర్తయింది. అయితే, టీబీజీకేఎస్ కుఆరు నెలల తర్వాత (2018, ఏప్రిల్)లో గుర్తింపు హోదా సర్టిఫికెట్ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లో కాలపరిమితి రెండేండ్లేనని పేర్కొన్నారు. దీనిపై గుర్తింపు సంఘం కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ వివిధ సాకులు చూపుతూ వాయిదా వేస్తూ వచ్చాయి. గతేడాది నవంబర్ లో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించగా, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ, మేనేజ్మెంట్ మరో మూడు నెలల గడువు కోరింది. ఈ క్రమంలో మూడు సార్లు వాయిదా పడిన ఎన్నికలు ఎట్టకేలకు అక్టోబర్28న జరగబోతున్నాయి.
అక్టోబర్ 28న సింగరేణి ఎన్నికలు !
September 12, 2023
0
Tags