ఢిల్లీ నుంచి రాంచీ బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన గంటలోపే తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి తిరిగి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇండిగో 6ఈ 2172 విమానం శనివారం ఉదయం 7.40 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాంచీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెనక్కి మళ్లించాల్సి వచ్చింది. దీంతో 8.20 గంటలకు విమానం తిరిగి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది. 'ఢిల్లీ నుంచి రాంచీకి బయల్దేరిన ఇండిగో 6ఈ 2172 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ముందు జాగ్రత్తగా తిరిగి ఢిల్లీకి మళ్లించాల్సి వచ్చింది' అని ఎయిర్ లైన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు అందులోని ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. కాగా, సాంకేతిక సమస్యల కారణంగా గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఇండిగో విమానం వెనక్కి మళ్లడం 24 గంటల వ్యవధిలో ఇది రెండో ఘటన. శుక్రవారం బీహార్ రాజధాని పాట్నా లోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయల్దేరిన ఇండిగో 6ఈ 2433 విమానం టేకాఫ్ అయిన 3 నిమిషాల్లోనే తిరిగి అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. విమానంలోని ఒక ఇంజిన్ పనిచేయడం లేదని పైలట్ గుర్తించి అధికారులకు తెలియజేశారు. దీంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఉదయం 9.11 గంటలకు విమానాన్ని పాట్నా విమానాశ్రయంలోనే సురక్షితంగా ల్యాండ్ చేశారు.
టేకాఫ్ అయిన గంటలోపే వెనక్కి వచ్చిన ఇండిగో విమానం !
August 05, 2023
0
Tags