ఒడిశాలోని జాజ్‌పుర్ జిల్లాలో రసూల్‌పుర్ వద్ద చెన్నై- కోల్‌కతాలను కలిపే ఎన్‌హెచ్‌పై ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ జాతీయ రహదారిపై నిర్మించిన ఓ వంతెన రెండు ముక్కలు కావడం గమనార్హం. అందులో ఒక భాగం నేలపైకి ఒరిగిపోయింది. వెంటనే అక్కడున్న ఓ ఇద్దరు ఇతర వాహనాలను నిలిపేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది! అనంతరం పోలీసులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపేసి, వాహనాలను దారి మళ్లించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్‌హెచ్-16పై రసూల్‌పుర్ వద్ద రాకపోకలకు వీలుగా రెండు వంతెనలు నిర్మించారు. భువనేశ్వర్ వైపు వెళ్తోన్న ఓ బస్సు మంగళవారం ఉదయం అందులోని ఓ వంతెనను దాటింది. ఈ క్రమంలోనే ఆ వంతెన నిర్మాణంలోని ఓ స్పాన్ క్రమంగా పడిపోవడం మొదలైంది. అంతలోనే అది పెద్దఎత్తున శబ్దంతో కిందికి జారిపోయింది. ఇది గుర్తించిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌తోపాటు కౌఖాయ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ హోంగార్డు అప్రమత్తమయ్యారు. వెంటనే వంతెనపైకి వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాహనాలను దారిమళ్లించారు. వంతెన కూలిపోయిన మార్గంలో రాకపోకల కట్టడికి బారికేడ్లు ఏర్పాటు చేశారు. 'భువనేశ్వర్ బస్సు వెళ్లిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల ఓ వాహనం కూడా వంతెన దాటింది. ఆ తర్వాత వంతెన కూలిపోయింది. దీంతో మేం ఇతర వాహనాలను బ్రిడ్జిపైకి వెళ్లకుండా ఆపేశాం. స్థానికులు కూడా సహకరించారు' అని హోంగార్డు తెలిపారు. అక్కడున్నవారి అప్రమత్తతతో.. ఇతర వాహనాలకు పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారుల బృందం వంతెనను పరిశీలించింది. 2008లో నిర్మించిన ఈ బ్రిడ్జి నిర్మాణ వైఫల్యం కారణంగానే కూలిపోయి ఉండొచ్చని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ (చండీఖోల్) జేపీ వర్మ మీడియాకు తెలిపారు. 'ఇది ఆకస్మిక వైఫల్యం. నిర్వహణ సమస్య కాదు. కారణాలను తెలుసుకునేందుకు సాంకేతిక బృందం ఘటనాస్థలికి చేరుకుంది. విచారణ జరిపి, తగు చర్యలు తీసుకుంటాం. కొత్త వంతెన నిర్మించే వరకు వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నాం' అని చెప్పారు. https://t.me/offerbazaramzon
రెండు ముక్కలైన చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారి వంతెన !
July 18, 2023
0
Tags