30 ఏళ్లుగా హైకోర్టుల్లో 71 వేల పెండింగ్‌ కేసులు !

Telugu Lo Computer
0


దేశంలోని  న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి కేసుల విచారణ జరగడం చూస్తుంటాం. ఈ తరహా లెక్కలనే కేంద్రం శుక్రవారం లోక్‌సభకు వెల్లడించింది. 30 ఏళ్లకు పైగా వివిధ హైకోర్టుల్లో 71 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సభ్యులు అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది జులై 24 వరకు లెక్కల్ని ఆయన వెల్లడించారు. '30 ఏళ్లకు పైగా హైకోర్టుల్లో 71,204 పెండింగ్ కేసులున్నాయి. అదేవిధంగా దిగువ న్యాయస్థానాల్లో ఆ సంఖ్య 1,01,837గా ఉంది' అని మంత్రి తెలిపారు. 'అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఇంటిగ్రేటెడ్ కేస్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ఆధారంగా రూపొందించిన డేటా ప్రకారం.. జులై ఒకటి నాటికి సుప్రీంలో 69,766 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి' అని చెప్పారు. అలాగే జులై 14 నాటికి హైకోర్టుల్లో మొత్తం పెండింగ్ కేసుల(pending cases) సంఖ్య 60,62, 953 కాగా.. దిగువ కోర్టుల్లో ఆ సంఖ్య 4,41,35,357గా ఉంది. దీనికి సంబంధించిన సమాచారం నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌లో అందుబాటులో ఉందని మేఘ్వాల్‌ తెలిపారు. ఆయన ఇదివరకు రాజ్యసభలో చెప్పిన లెక్క ప్రకారం.. జులై 20 నాటికి దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో కలిపి పెండింగ్ కేసులు ఐదు కోట్ల మార్కు దాటాయి. అయితే కేసుల సంఖ్య ఈ స్థాయిలో పెండింగ్‌లో ఉండటానికి వివిధ కోర్టుల్లో న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండటం ఒక్కటే కారణం కాదని తెలిపారు. మౌలిక సదుపాయాలు, సహాయక సిబ్బంది, ఆధారాల్లో నెలకొన్న సంక్లిష్టత, కేసుతో సంబంధం ఉన్నవారి సహకారం వంటి కారణాలు కేసు విచారణ ఆలస్యంలో కీలకంగా మారతాయని చెప్పారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)