లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ ఆందోళన చేపడుతున్న రెజ్లర్లకు 1983లో ప్రపంచకప్ గెలిచిన క్రికెట్ టీమ్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌తో పాటు సునీల్ గవాస్కర్, మహీందర్ అమర్‌నాథ్‌లు ఆ ప్రకటనలో రెజ్లర్లను అభ్యర్థించారు. గత నెల 30న తమ పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామన్న రెజ్లర్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పతకాలు ఎన్నో ఏళ్ల కృషికి నిదర్శనమని, త్యాగం, సంకల్పం, ధైర్యం వాటితో ముడిపడివున్నాయని అన్నారు. కేవలం అవి వారికి మాత్రమే చెందినవి కావని, దేశ ప్రతిష్టకు చిహ్నమని పేర్కొన్నారు. వారి ఫిర్యాదులను ప్రభుత్వం విని, త్వరలోనే పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. నూతన పార్లమెంట్ భవనం ఎదుట ఆందోళన చేపట్టేందుకు వెళుతున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసులు విరుచుకుపడిన ఘటనపై కూడా స్పందించారు. రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల దురుసు ప్రవర్తన చూసి చలించిపోయామని అన్నారు. వాళ్ల మనోవేదనను వినాలని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రెజ్లర్లకు మద్దతుగా రైతు సంఘాలు, ఖాప్ నేతలు బుధవారం మహా పంచాయత్ నిర్వహించారు.
రెజ్లర్లకు ప్రపంచకప్ గెలిచిన క్రికెట్ టీమ్ మద్దతు
June 02, 2023
0
Tags