రైలు ప్రమాదంపై సోషల్ మీడియాలో విద్వేష ప్రచారం !

Telugu Lo Computer
0


ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం కనీస ఆధారాలు లేని ఆరోపణలతో, కొందరిపై విమర్శలతో వాట్సప్ యూనివర్సిటీ దుర్మార్గమైన ప్రచారానికి దిగింది. రైల్వే ఉద్యోగ సంఘాలు కమ్యూనిస్టు ఉద్యోగ సంఘాలు కాబట్టి, ఆ ఉద్యోగులు కావాలనే ఈ ప్రమాదాన్ని సృష్టించి 280 మందిని చంపేశారని, ఇది కమ్యూనిస్టుల పనే అని సోషల్ మీడియాలో ప్రచారాన్నందుకున్నారు. అక్కడితో ఆగకుండా ఈ ప్రమాదానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కూడా ముడిపెడుతూ దుష్ప్రచారానికి దిగారు. రాహుల్ విదేశాలకు వెళ్ళిన సమయంలోనే ఈ ప్రమాదం ఎందుకు జరిగింది ? అని ప్రశ్నిస్తూ కుట్ర పూరితంగా అనుమానాలు రెచ్చగొడుతున్నారు. ముంబై సీరియల్ పేలుళ్ళూ, ఈ రైలు ప్రమాద‍ం రెండూ శుక్రవారమే జరిగాయని చెబుతూ, ప్రమాదం జరిగిన స్థలానికి దగ్గరలో మజీదు ఉందని విషభీజాలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. స్టేషన్ మాస్టర్ ముస్లిం అని, ఆ ప్రమాదానికి అతనే కారణమని ప్రచారం చేస్తున్నారు. నిజానికి వాళ్ళు ప్రచారం చేస్తున్న ఫోటోలో ఉన్నది మజీదు కాదని, అది ఇస్కాన్ టెంపుల్ అని ఒడిశాకు చెందిన పలు ఫ్యాక్ట్ చెక్ మీడియా సంస్థలు స్పష్టం చేశాయి. విజయ సారథి అనే ఓ సోషల్ మీడియన్ అయితే రైల్వే ఉద్యోగుల మీద, కమ్యూనిస్టుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు వచ్చే విధంగా వరస పోస్టులు చేశారు. బీజేపీ ప్రభుత్వాన్ని, రైల్వే మంత్రిని పొగుడుతూ ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి అలుపెగకుండా శ్రమిస్తున్నారంటూ ప్రచారం చేస్తూ ఆయన చేసిన పోస్టులు వందల మంది షేర్లు చేశారు. ఇక ఘటన జరిగిన వెంటనే వేలాది మంది యువకులు వచ్చి రక్తదానం చేస్తుంటే వారంతా తమ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్క విజయ సారథి మాత్రమే కాక దేశవ్యాప్తంగా అనేక మంది ఇటువంటి అనుమానాల విష భీజాలు నాటే ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ప్రభుత్వాన్ని ఆధారాలతో సహా విమర్శించిన వాళ్ళపై కేసులు మోపుతూ జైళ్ళ పాలు చేస్తున్న పాలకులు ఇటువంటి ఆధార రహిత దుష్ప్రచారాలపై నోరు మెదపకపోవడంపై నెటిజనులు మండిపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)