అర్ధరాత్రి అరుగుపై అప్పుడే పుట్టిన శిశువును వదిలి వెళ్లిన బాలిక !

Telugu Lo Computer
0


అప్పుడే పుట్టిన శిశువును అర్ధరాత్రి రోడ్డు మీద వదిలేయడంతో స్థానికుల చొరవతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన బాలిక (17) ఫిలింనగర్‌ పీఎస్‌ పరిధిలోని ఓ బస్తీలో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. పదో తరగతి పూర్తి చేసి ఖాళీగా ఉంటున్న బాలిక ఏడాదిన్నర క్రితం వనపర్తి జిల్లాలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి టైలరింగ్‌ నేర్చుకునేందుకు వెళ్లింది. అదే గ్రామంలో జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్న బాలస్వామి (24) బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి లోబర్చుకున్నాడు. ఏడాది క్రితం నగరానికి వచ్చిన బాలస్వామి ఓ గదిని అద్దెకు తీసుకుని బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. ప్రేమ విషయం తెలిసి పెళ్లి గురించి ఇరు కుటుంబాలు చర్చించినా ఫలితం లేకపోయింది. కుటుంబ సభ్యులకు పెళ్లి ఇష్టంలేదని బాలస్వామి ముఖం చాటేశాడు. అప్పటికే గర్భం దాల్చిన బాలిక కుటుంబ సభ్యులకు విషయం చెప్పలేదు. శుక్రవారం సాయంత్రం కడుపునొప్పి, వెన్ను నొప్పి వస్తుందని బాలిక తల్లికి చెప్పగా ఫిలింనగర్‌లోని ఓ డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లింది. బాలికకు రుతుక్రమం సరిగ్గా రావడం లేదని చెప్పడంతో డాక్టర్‌ రెండు ఇంజక్షన్లు ఇచ్చాడు. శనివారం తెల్లవారుజామున బాలిక ఇంట్లోనే ప్రసవం అయింది. పుట్టిన వెంటనే బాబు చనిపోయి ఉంటాడని భావించిన బాలిక ప్లాస్టిక్‌ కవర్లో చుట్టి ఇంటికి సమీపంలో ఓ అరుగుపై చిన్నారిని పెట్టి వెళ్లిపోయింది. బాబు ఏడుపు విన్న స్థానికులు ఈ విషయాన్ని బస్తీ నేత సుధాకర్‌రెడ్డికి చెప్పారు. సుధాకర్‌రెడ్డి వెంటనే ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించాడు. అంబులెన్స్‌ సిబ్బంది శిశువును నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించగా, బాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలించగా బాలిక వచ్చి బాబును అరుగుమీద ఉంచి వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. పోలీసులు బాలికను విచారించగా ముందు ఏమీ తెలియదని బుకాయించి ఆపై జరిగిన విషయాన్ని చెప్పింది. బాలికను వైద్య పరీక్షల కోసం నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించి, బాలిక గర్భానికి కారణమైన బాలస్వామిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)