మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఓ దివ్యాంగురాలు చూపించిన ఆదరాభిమానానికి భావోద్వేదానికి లోనయ్యారు. రాష్ట్రంలోని జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ యువతి తిలకం దిద్దారు. వికలాంగురాలిగా ఉన్న యువతి నేలపై కూర్చొని ఉంటే దేవేంద్ర ఫడ్నవీస్ ఆమెతో పాటే నేలపై కూర్చున్నారు. అప్పుడా యువతి కాలి బొటన వేలితో ప్లేట్‌లోంచి తిలకం తీసి దేవేంద్ర ఫడ్నవీస్ నుదుటిన పెట్టింది. ఆ తర్వాత హారతి ఇచ్చింది. ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు అందర్ని ఆకట్టుకుంటున్నాయి.
''ఇప్పటి వరకు ఎందరో తల్లులు, సోదరీల నుంచి నేను ఆశీర్వాదం తీసుకున్నారు. తిలకం స్వీకరించాను. ఇప్పుడు కూడా నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనివేలు నా నుదిటి మీదకు చేరింది. అయితే, అది చేతి వేలు కాదు.. కాలి బొటనవేలు. జీవితంలో జరిగే ఇలాంటి క్షణాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురిచేస్తాయి. మన కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఈ సోదరి నాకు తిలకం దిద్ది, అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె ముఖంలో చిరునవ్వు, కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించింది. 'నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే.. నాకు ఎవరి జాలి, దయ అవసరం లేదు. ఆ పరిస్థితులను దాటుకొని వెళ్తాను' అని ఆ మెరుపును చూస్తే నాకనిపించింది'' అని డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. అలాగే ప్రతిపోరాటంలో ఆ యువతిని అండగా ఉంటానని భరోసా కల్పించారు.