మా నిరసన రాజకీయ ప్రేరేపితం కాదు !

Telugu Lo Computer
0


తమ నిరసన రాజకీయ ప్రేరేపితం కాదని ఒలింపిక్‌ పతక విజేత సాక్షి మాలిక్‌ , ఆమె భర్త సత్యవర్త్‌ కడియన్‌ పేర్కొన్నారు. రెజ్లర్లు ఐక్యంగా లేనందున గత కొన్నేళ్లుగా వేధింపులను మౌనంగా భరిస్తున్నారని అన్నారు. తమ ఆందోళనలపై తప్పుడు కథనాలు ప్రసారమవుతున్నాయని, వాటిపై వివరణ నివ్వాలని కోరుకున్నామని ట్విటర్‌ వీడియోలో పేర్కొన్నారు. తమ నిరసన రాజకీయ ప్రేరేపితం కాదని సత్యవర్త్‌ కడియన్‌ స్పష్టం చేశారు. తాము జనవరిలో జంతర్‌ మంతర్‌కి చేరుకున్నామని, పోలీసుల అనుమతి కోసం ఇద్దరు బీజీపీ నేతలు అనుమతి తీసుకున్నారని అన్నారు. మాజీ రెజ్లర్‌ బబితా ఫోగట్‌, తీరత్‌ రాణా ఇద్దరూ బిజెపికి చెందిన వారే. ఈ నిరసన కాంగ్రెస్‌ మద్దతు కాదని, గత 10-12 ఏళ్లుగా వేధింపులు కొనసాగుతున్నాయని, 90 శాతం కంటే ఎక్కువ మందికి ఈ విషయం తెలుసు అని అన్నారు. రెజ్లర్ల మధ్య సోదరభావం లేనందున కొంతమంది మాత్రమే తమ గొంతుకలను వినిపించారని అన్నారు. మైనర్‌ తన ఫిర్యాదును ఉపసంహరించుకున్న విషయం అందరికీ తెలిసిందే. వారిది పేద కుటుంబం.. ఒక శక్తివంతమైన వ్యక్తి ఎదుర్కోవడానికి వారికి ధైర్యం చాలలేదని అన్నారు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్‌, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సాక్షీ మాలిక్‌, వినేష్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియా సహా పలువురు రెజ్లర్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, జెకె మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ సహా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు నిరసన ప్రదేశానికి చేరుకుని, తమ మద్దతును తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)