జపాన్‌లోని బుల్లెట్‌ ట్రైన్‌లో ప్రయాణించిన స్టాలిన్‌ !

Telugu Lo Computer
0


తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ అధికార పర్యటన నిమిత్తం జపాన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా ఆదివారం ఆ దేశంలోని బుల్లెట్‌ ట్రైన్‌లో ఆయన ప్రయాణించారు. ఒసాకా నుంచి జపాన్‌ రాజధాని టోక్యో నగరం మధ్య ఉన్న 500 కిలోమీటర్ల దూరాన్ని బుల్లెట్‌ ట్రైన్‌లో కేవలం రెండున్నర గంటల్లోపు చేరుకున్నట్లు తెలిపారు. బుల్లెట్‌ రైలులో ప్రయాణించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. బుల్లెట్‌ రైలుకు సమానమైన రైళ్లు, డిజైన్‌ పరంగానే కాకుండా వేగం, నాణ్యతతో కూడిన రైల్వే సేవలు భారతీయులకు కూడా అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొందాలని, వారి ప్రయాణం సులభతరం కావాలని అందులో పేర్కొన్నారు. 'ఫ్యూచర్ ఇండియా' అంటూ హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చారు. కాగా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన 'వందే భారత్‌' రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. వేగంతో పోల్చితే శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో ఇవి పోటీ పడలేకపోతున్నాయి. అలాగే పశువులు ఢీకొనడం వంటి చిన్న ప్రమాదాలకే వందే భారత్‌ రైలు ఇంజిన్‌ ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు వందే భారత్‌ రైలు ప్రయాణ ఛార్జీలు కూడా పేదలు, మధ్య తరగతి ప్రజలు భరించలేని స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ జపాన్‌ పర్యటన సందర్భంగా అక్కడి బుల్లెట్‌ ట్రైన్స్‌ డిజైన్‌, వేగంతోపాటు సేవల్లో నాణ్యత గురించి తన ట్వీట్‌లో ప్రస్తావించారు. తమిళనాడుకు పెట్టుబడుల కోసం సింగపూర్‌, జపాన్‌లో ఆయన పర్యటిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)