నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించిన ఏడుగురు ముఖ్యమంత్రులు

Telugu Lo Computer
0


సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్‌ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ బహిష్కరించారు. కాగా, నీతి ఆయోగ్‌ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ శుక్రవారమే ప్రకటించారు. ఈ మేరకు పీఎంకు లేఖ రాశారు. సుప్రీం ఆదేశాలకు కట్టుబడి ప్రధాని వ్యవహరించడం లేదని, అలాంటప్పుడు సాధారణ ప్రజలు న్యాయం కోసం ఎక్కడికి వెళ్తారని కేజ్రీ తన లేఖలో ప్రశ్నించారు. సహకార సమాఖ్యకు విలువ లేనప్పుడు, నీతి ఆయోగ్ మీటింగ్‌కు హాజరుకావడం జోకే అవుతుందని అన్నారు. పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ కూడా నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. పంజాబ్‌ రాష్ట్ర ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించే వరకు సమావేశంలో పాల్గొనడం వల్ల ప్రయోజనం లేదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి, చీఫ్‌ సెక్రటరీని నీతి ఆయోగ్‌ సమావేశానికి పంపుతామన్న పశ్చిమ బెంగాల్‌ విజ్ఞప్తిని కేంద్రం పరోక్షంగా తిరస్కరించింది. 'సీఎం హాజరు కావొచ్చు' అని సూచించింది. దీంతో సమావేశానికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్న మమతా బెనర్జీ (Mamata Banerjee) తన ప్రతినిధులను కూడా పంపకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆరోగ్య సమస్యల కారణంగా ఈ మీటింగ్‌కు హాజరు కాలేనని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాత్‌ వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)