మామకు బీమా చేయించి హతమార్చాడు !

Telugu Lo Computer
0


వైయస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన యరవల చెన్నకృష్ణారెడ్డి (59), లక్ష్మీప్రసన్న దంపతులు తమ పెద్ద కూమర్తెను విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామానికి చెందిన రాయపాటి కిరణ్‌కుమార్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్లకు కిరణ్‌కుమార్‌రెడ్డి తన మామ చెన్నకృష్ణారెడ్డికి కోటి రూపాయలకు జీవిత బీమా చేయించాడు. పత్రాల్లో నామినీగా తన పేరు నమోదు చేయించాడు. 2019 జనవరి 30న మల్లెం శ్రీనివాసులరెడ్డి అనే స్నేహితుడితో కలిసి మామను కారులో ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లాడు. దారిలో మిత్రుడితో కలిసి ఆయనను హతమార్చి ప్రొద్దుటూరు సమీపంలోని పోట్లదుర్తి వద్ద రోడ్డుపై విసిరేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అక్కడున్న స్థానికులు ఇది గుర్తించి వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు నిందితులిద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఈ క్రమంలో మంగళవారం ప్రొద్దుటూరు న్యాయస్థానం న్యాయమూర్తి జీఎస్‌ రమేష్‌కుమార్‌ నేరస్థులకు జీవిత ఖైదు విధించడంతో పాటు ఒక్కొక్కరికి రూ. 11 లక్షల చొప్పున జరిమానా విధించారు. చెల్లించని పక్షంలో అదనంగా మరో ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పునిచ్చారని సీఐ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)