ఆనంద్ మోహన్ విడుదలపై ఓవైసీ మండిపాటు !

Telugu Lo Computer
0


తెలుగు దళిత ఐఏఎస్‌ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగానే బీహార్‌ మాజీ ఎంపీ, డాన్‌, గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌ మోహన్‌ను సహర్స జైలు నుంచి విడుదల చేయడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఆనంద్‌ మోహన్‌ విడుదల కోసం ఏప్రిల్ పదిన జైలు మాన్యువల్‌లో మార్పులు చేయించడాన్ని ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. జైలు మాన్యువల్‌లో మార్పులతో ఆనంద్ మోహన్‌తో పాటు బీహార్‌లో 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న 26 మంది కూడా విడుదల అయ్యారు. వాస్తవానికి మాన్యువల్‌లో మార్పులు చేయకపోతే ఆనంద్ మోహన్ మరో ఆరేళ్లు జైళ్లోనే ఉండాలి. అయితే తన పెద్దకొడుకు చేతన్‌ ఆనంద్‌ నిశ్చితార్థం కోసం పెరోల్‌పై బయటకు వచ్చిన ఆనంద్ మోహన్‌కు వేడుకలో ఉండగానే జైలు నుంచి శాశ్వతంగా విడుదలవుతున్న సమాచారం అందించారు. ఆ వేడుకకు బీహార్‌ సీఎం నితీశ్‌, డిప్యూటీ సీఎం తేజస్వీ, పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఓ కలెక్టర్‌ హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని జైలు మాన్యువల్‌లో మార్పులతో విడిచిపెట్టడాన్ని బీహార్ ఐఏఎస్ అధికారులు ప్రశ్నించకపోవడంపై ఒవైసీ విస్మయం వ్యక్తం చేశారు. నీతీశ్‌ ప్రభుత్వం ఆనంద్‌ మోహన్‌ను విడుదల చేయడాన్ని కృష్ణయ్య భార్య ఉమ ఇప్పటికే తప్పుపట్టారు. ఈ విషయంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని కోరారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఆనంద్ మోహన్ విడుదలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా ఆనంద్ మోహన్‌ను విడుదల విషయంలో నితీశ్ వెనకడుగు వేయలేదు. ప్రస్తుత ఆర్జేడీ-జేడియూ-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారులో రాజ్‌పుత్ నాయకుల ఒత్తిడి మేరకే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రాజ్‌పుత్‌లను ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)