ఇంటర్‌సెప్టార్‌ టెస్ట్‌ విజయవంతం !

Telugu Lo Computer
0


బాలిస్టిక్ క్షిపణి ఇంటర్‌సెప్టార్‌ టెస్ట్‌ను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. తొలిసారి సముద్ర ప్రాంతంలో నౌకపై ఈ పరీక్షను చేపట్టింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భారత నౌకాదళం కలిసి బంగాళాఖాతంలో ఈ ప్రయోగాన్ని చేపట్టాయి. శనివారం ఒడిశా తీరంలో యుద్ధ నౌక పైనుంచి సముద్ర ఆధారిత ఎండో-అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి తొలి పరీక్షను నిర్వహించాయి. శత్రు దేశాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ముప్పును పసిగట్టి దానిని అడ్డుకుని నాశనం చేయడం ఈ టెస్ట్‌ ముఖ్య ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో నౌకాదళంలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్‌ నిలిచిందని వెల్లడించింది. దీనికి ముందు బాలిస్టిక్‌ క్షిపణిని అడ్డుకుని నాశనం చేసే సామర్థ్యం ఉన్న ఇంటర్‌సెప్టార్‌ను భూమి పైనుంచి కూడా డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, సముద్ర ఆధారిత ఇంటర్‌సెప్టార్‌ క్షిపణి తొలి పరీక్ష విజయవంతంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ టెస్ట్‌ నిర్వహించిన డీఆర్డీవో, ఇండియన్‌ నేవీని ఆయన అభినందించారు. ఈ క్షిపణి రూపకల్పన, అభివృద్ధిలో భాగమైన బృందాలను డీఆర్డీవో చీఫ్ సమీర్ వీ కామత్ ప్రశంసించారు. అత్యంత సంక్లిష్టమైన నెట్‌వర్క్-సెంట్రిక్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో దేశం స్వావలంబన సాధించిందని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)