ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ ప్రకారం భారత్ లో ముందస్తుగా అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటుందని,ఇది చాలా కాలం పాటు ఉంటుందని అంచనా వేసింది. ఈసారి వేసవి ముందస్తుగా రావడంతో పాటు, ఎక్కువ కాలం కొనసాగి, ప్రజల ఆయుష్షుని కూడా తగ్గించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆర్థికంగానూ తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపింది. భారత్‌లో పని చేసే వర్గంలో 75 శాతం మంది.. అంటే 38 కోట్ల మంది మండుటెండల్లో చెమటోడుస్తూ పనిచేస్తున్నారు. వాళ్లందరి ప్రాణాలకు వడగాల్పులు ముప్పుగా మారతాయని రిపోర్ట్ తెలియజేసింది. 2030 నాటికే ప్రపంచవ్యాప్తంగా హీట్ వేవ్స్ వల్ల 8 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే, వారిలో దాదాపు మూడున్నర కోట్ల మంది భారత్‌లోనే ఉంటారని.. అంచనా వేశారు. గత ఏప్రిల్‌లో ఎండాకాలం మొదట్లోనే వేడి గాలులతో భారత్ ఉక్కిరిబిక్కిరైంది. ఇదే.. దేశం మొత్తాన్ని ఆందోళనకు గురిచేసింది. రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయ్. గతంలో.. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చిలోనూ.. అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కనిపించింది. అందువల్ల.. భవిష్యత్‌లో భారత్‌లో సంభవించే వడగాల్పులు.. మానవ మనుగడ పరిమితిని తగ్గించగలవని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. దక్షిణాసియా అంతటా పెరుగుతున్న టెంపరేచర్ గురించి అనేక మంది క్లైమేట్ సైంటిస్టులు.. చాలా కాలంగా హెచ్చరిస్తున్నట్లుగా.. ఇటీవలి పరిస్థితులు బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో.. యూఎన్ ఇంటర్-గవర్నమెంటల్ ప్యానెల్.. ఐపీసీసీ ఆరో నివేదికలోనూ వాతావరణ మార్పులపై.. ఇలాంటి హెచ్చరికలే చేశారు. రాబోయే దశాబ్దకాలంలో.. భారత ఉపఖండం మరింత తీవ్రమైన వేడి గాలులను ఎదుర్కొంటుందని చెప్పారు. ఐపీసీసీ అంచనా ప్రకారం కర్బన ఉద్గారాలు ఇలాగే ఎక్కువగా కొనసాగితే.. 2036 నుంచి 2065 నాటికి భారత్ అంతటా వేడి గాలులు 25 రెట్లు పెరిగే అవకాశం ఉందని.. జీ20 క్లైమేట్ రిస్క్ అట్లాస్‌లో హెచ్చరించింది. దేశంలో పెరిగే ఉష్ణోగ్రతలు ఆర్థిక ఉత్పాదకతను కూడా దెబ్బతీస్తుందని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అంచనా వేసింది. దక్షిణాసియా దేశాల్లో భారత్‌లోని కార్మికులపై హీట్ వేవ్స్ తీవ్ర ప్రభావం చూపాయని చెబుతున్నారు. గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ మెకిన్సే అండ్ కంపెనీ విశ్లేషణ ప్రకారం.. పెరుగుతున్న వేడి, తేమ కారణంగా కోల్పోయిన కార్మికులు.. ఈ దశాబ్దం చివరినాటికి భారత జీడీపీలో 4.5 శాతంగా చెబుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో.. భారత్ దీర్ఘకాలిక ఆహార, ప్రజారోగ్య భద్రత నమ్మకమైన కోల్డ్ చైన్ నెట్‌వర్క్‌పై ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే.. దేశమంతటా ఆహారం, ఔషధాలను సప్లై చేసేందుకు.. అడుగడుగునా పనిచేసే కోల్డ్ చైన్ కూలింగ్ సిస్టమ్ అవసరం. ప్రయాణంలో ఒక్కసారి టెంపరేచర్ తగ్గితే.. కూలింగ్ సిస్టమ్ చెడిపోయి.. తాజా ఉత్పత్తులు చెడిపోవచ్చు. దేశంలోని తాజా ఉత్పత్తుల్లో.. కేవలం 4 శాతం మాత్రమే కోల్డ్ చైన్ సౌకర్యాలతో ఉన్నాయి. దేశమంతటా ఉష్ణోగ్రతలు పెరిగేకొద్దీ.. కూలింగ్ సిస్టమ్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. అయితే, జనాభాలో మూడింట రెండొంతుల మంది రోజుకు 150 రూపాయల కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. ఇదే సమయంలో ఏసీ యూనిట్ల ధరలు భారీగా పెరిగిపోయే అవకాశం ఉంది. విలాసవంతమైన ఎయిర్ కూలింగ్ సిస్టమ్‌లు కొందరికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్‌లో సమర్పించిన విశ్లేషణ ప్రకారం.. కేవలం 8 శాతం భారతీయ కుటుంబాలు మాత్రమే ఏసీ యూనిట్లను కలిగి ఉన్నాయి. అందువల్ల.. దేశంలోని అనేక పేద, అట్టడుగు వర్గాలకు తీవ్రమైన వేడి.. మరింత హాని కలిగిస్తుందని.. నివేదిక స్పష్టం చేసింది.
ప్రపంచ బ్యాంకు నివేదికలో భారత్ ను హడలెత్తించే అంశాలు !
December 09, 2022
0
Tags