మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ మంత్రి రాజా పటారియా ఓ కార్యక్రమానికి హాజరై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనుకుంటే ప్రధాని నరేంద్ర మోదీని చంపేయాలని, ఇందుకు సిద్ధంగా ఉండాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. '' మోదీ దేశంలో ఎన్నికలకు ముగింపు పలుకుతారు. మతం, కులం, భాష పరంగా మోదీ దేశాన్ని విభజిస్తారు. దళితులు, గిరిజనలు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మోదీని చంపేయడానికి సిద్ధంగా ఉండాలి'' అని రాజా పటారియా వ్యాఖ్యానించారు. తాను మహాత్మగాంధీ అహింస సిద్ధాంతాన్ని అనుసరిస్తానని చెప్పారు. అందుకే మైనారిటీల రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీని ఓడించాల్సి ఉందనేది తన ఉద్దేశ్యమని తెలిపారు. ఇవి తీవ్రమైన వ్యాఖ్యలనే విషయాన్ని గమనించిన రాజా పటారియా దిద్దుబాటుకు ప్రయత్నించారు. చంపడమంటే తన ఉద్దేశ్యంలో ఓడించడమని క్లారిటీ ఇచ్చారు. కానీ ఈ దిద్దుబాటు వివరణ ఆయనకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడి మొదలైంది. రాజస్థాన్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇందుకు సంబంధించిన నిరసన సెగ తగిలింది. రాజా పటారియాను అరెస్ట్ చేయాలంటూ రాహుల్ జోడో యాత్ర మధ్యలో పలువురు బీజేపీ వారు నినాదాలు చేశారు. రాజా పటారియాపై కేసు నమోదు చేయాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 'క్షమించరాని నేరం' అంటూ ఓ కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ఇక మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్.. రాహుల్ టార్గెట్‌గా విమర్శలకు దిగారు. ''భారత్ జోడో యాత్ర చేస్తున్నామంటూ నటిస్తున్నవారి నిజరూపం బయటపడింది'' అని అన్నారు. పటారియా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నిజమైన సెంటిమెంట్‌ను బహిర్గతపరిచాయన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
కాంగ్రెస్ మాజీ మంత్రి రాజా పటారియా వివాదాస్పద వ్యాఖ్యలు !
December 12, 2022
0
Tags