ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై అస్సాం ముఖ్యమంత్రి, హిమంత బిశ్వ శర్మ దాఖలు చేసిన పరువు నష్టం కేసును రద్దు చేయాలని ఆయన చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హిమంత బిశ్వ శర్మ, ఆయన సతీమణి రినికి భుయాన్ శర్మ ఈ పరువు నష్టం దావాను దాఖలు చేశారు. చర్చను ఈ స్థాయికి దిగజార్చినందుకు పర్యవసానాలను ఎదుర్కొనక తప్పదని మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిసోడియా వాడిన భాషను గట్టిగా ప్రశ్నించింది. ఇటువంటి భాషను ఉపయోగించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఉండవలసిందని పేర్కొంది. జస్టిస్ సంజయ్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మనీశ్ సిసోడియా ఈ ఏడాది జూన్ 4న న్యూఢిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, కోవిడ్-19 మహమ్మారి నుంచి రక్షణ పొందడం కోసం ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ కిట్లను హిమంత బిశ్వ శర్మ అత్యధిక ధరకు కొనుగోలు చేశారని ఆరోపించారు. శర్మ ఈ కిట్ల కొనుగోలు కాంట్రాక్టును తన భార్య నడుపుతున్న సంస్థకు, తమ కుమారుని వ్యాపార భాగస్వాములు నడుపుతున్న సంస్థలకు అత్యధిక ధరలకు అప్పగించారన్నారు. రూ.600కు లభించే కిట్‌ను రూ.990కి కొనేందుకు కాంట్రాక్టు ఇచ్చారన్నారు. ఈ కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్)-లిబరేషన్, ఆర్‌సీపీఐ, టీఎంసీ, రాయ్‌జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్, తదితర పార్టీలు డిమాండ్ చేశాయి.
మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు !
December 12, 2022
0
Tags