ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. కీవ్, మైకొలేవ్, ఖర్కివ్, ఖేర్సన్ సహా పలు ప్రధాన నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. చెర్నిహైవ్ నగరం.. మూడు శక్తిమంతమైన దాడులతో దద్దరిల్లింది. కీవ్‌లో సరకు రవాణా విమానాలు తయారుచేసే పరిశ్రమపై దాడి జరిగింది. మరోవైపు.. డొనెట్స్క్లో ఉక్రెయిన్ క్షిపణి దాడి జరపగా.. 20 మంది చనిపోయారు. మరో 28 మంది గాయపడ్డారు. డొన్బాస్లో ఇరు వర్గాల మధ్య భీకర దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ ఆర్మీ ప్రకారం.. 100 మందికిపైగా రష్యా సైనికులు మరణించారు. ఆరు వాహనాలు ధ్వంసమైనట్లు కీవ్ ఇండిపెండెంట్ పేర్కొంది. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వర్చువల్‌గా ప్రసంగించనున్నారు. అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్‌ను ఉద్దేశించి జెలెన్స్కీ చేసే ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని బైడెన్ సర్కార్ నిర్ణయించింది. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న దేశాధినేతకు తామిచ్చే గౌరవానికి ఈ ప్రసంగం.. ఓ నిదర్శనమని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడులు, తాము చేస్తున్న ప్రతిఘటనను జెలెన్స్కీ అమెరికా చట్టసభలకు వివరించనున్నారు. ఈనెల మొదటి వారంలో ఒకసారి అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి వీడియో కాల్ ద్వారా మాట్లాడిన జెలెన్స్కీ.. మరింత సైనిక సాయం చేయాలని అభ్యర్థించారు. బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) మరోసారి సాయం కోసం విజ్ఞప్తి చేయనున్నారు. ఉక్రెయిన్‌కు 13.6 బిలియన్ డాలర్ల సాయం చేసే బిల్లును ఇటీవలే అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. ఆ బిల్లుపై బైడెన్ మంగళవారం సంతకం చేయనున్నారు.
ఉక్రెయిన్ క్షిపణి దాడిలో 20 మంది మృతి
March 15, 2022
0
Tags