ఎంఎన్‌జేలో క్యాన్సర్‌కి ఉచిత చికిత్స !

Telugu Lo Computer
0


కాలానుగుణంగామారుతున్న జీవన  శైలి, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో రోజు రోజుకు క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఎంఎన్‌జేకు ప్రతి సంవత్సరం దాదాపు 10వేల మంది క్యాన్సర్‌ రోగులు కొత్తగా రిజిస్టర్‌ అవుతున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి. వైద్యశాస్త్రం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భయంకరమైన క్యాన్సర్‌ వ్యాధులకు సంబంధించి ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వస్తున్నా నేటికీ క్యాన్సర్‌ రోగుల్లో 50శాతానికి పైగా రోగులు అడ్వాన్స్‌డ్‌ స్టేజిలోనే దవాఖానకు పరుగులు తీస్తున్నట్లు వైద్యులు వాపోతున్నారు. ఎలాంటి క్యాన్సర్‌ వ్యాధులనైనా ప్రారంభ దశలో గుర్తిస్తే అరికట్టవచ్చని ఎంఎన్‌జే క్యాన్సర్‌ హాస్పిటల్‌ వైద్యులు చెబుతున్నారు. ప్రపంచ క్యాన్సర్‌ డేను పురస్కరించుకుని నేటి నుంచి ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు  డైరెక్టర్‌ డాక్టర్‌ జయలత తెలిపారు. రెండు సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు వివరించారు. గడిచిన రెండేండ్లలో 10వేల మందికి క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ జరిపినట్లు తెలిపారు. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షల కోసం మరో కొత్త మొబైల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ బస్సును నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. సుమారు రూ.25లక్షల నుంచి రూ.30లక్షల వరకు ఖర్చయ్యే బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ నిరుపేదలకు తీరని ఆర్థిక భారంగా నిలిచింది. అయితే నిరుపేద రోగుల ప్రాణాలను కాపాడేందుకు తెలంగాణ సర్కార్‌ ఖరీదైన బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్సను 4నెలల క్రితం ఎంఎన్‌జేలో ప్రారంభించింది. ఈ క్రమంలో గడిచిన నాలుగు నెలల్లో 15మంది రోగులకు బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్సను విజయవంతంగా నిర్వహించి వారికి పునర్జన్మ ప్రసాదించారు వైద్యులు. దీంతో పాటు ఆసుపత్రిలో ప్రతి రోజు 300 మందికి రేడియోథెరపీ, 340 మందికి కీమోథెరపీ అందిస్తున్నట్లు వివరించారు.  ప్రపంచ క్యాన్సర్‌ డే సందర్భంగా ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు న్యూ బర్గ్‌ డయాగ్నస్టిక్‌ వైస్‌ చైర్మన్‌ ఎ. గణేషన్‌ దుప్పట్లు, బొమ్మలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా గణేషన్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ను చిన్నారులు ధైర్యంగా ఎదుర్కొని ఆరోగ్యవంతులుగా జీవనం సాగించేందుకు న్యూ బర్గ్‌ డయాగ్నస్టిక్‌ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ శిరీష, ఎంఎన్‌జె దవఖాన వైద్యులు సీ.ఎస్‌ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)