పండుగ తర్వాత పెరుగుతున్న మిర్చి ధర

Telugu Lo Computer
0


మాములుగా సంక్రాంతి తర్వాత సాగే మిర్చి సీజన్‌లో ధర తగ్గుతుంటుంది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో మిర్చి పంట తుడిచి పెట్టుకుపోయిన దృష్ట్యా మార్కెట్‌లో ధర పెరుగుతూ పోతోన్నది. ఇప్పటికే క్వింటాల్‌ రూ.17 వేల మధ్యన స్థిరంగా ఉంది. అయితే గురువారం అనూహ్యంగా దేవనూరు డీలక్స్‌ వెరైటీకి రూ.20 వేల ధర లభించింది. దీంతో ప్రస్తుతం పంట చేతిలో ఉన్న రైతులు, వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రైతులు మిర్చిని గుంటూరు యార్డుకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. దాంతో రోజుకు లక్ష టిక్కీలు సీజన్‌ ప్రారంభంలో వస్తుంటాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఇంచుమించు 3 లక్షల టిక్కీల వరకు యార్డుకు రైతులు తీసుకొస్తుంటారు. అధిక సంఖ్యలో మిర్చి టిక్కీలు రావడంతో ఈ సీజన్‌లో ధర తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో క్వింటాల్‌కి రూ.7 వేలు కూడా రావు. అయితే ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేదు. ఖరీఫ్‌ సీజన్‌లో మిర్చి పంట నల్లితెగులు కారణంగా పూర్తిగా తుడిచి పెట్టుకుపోవడంతో మిర్చికి విపరీతమైన డిమాండ్‌ వచ్చింది. సంక్రాంతి వెళ్లి 15 రోజులు అయిపోయినా మార్కెట్‌ స్థిరంగా కొనసాగుతోన్నది. రోజుకు లక్ష టిక్కీలకు పైగా వస్తోన్నా వ్యాపారులు కొనుగోలు చేసేస్తోన్నారు. దీంతో తేజ, దేవనూరు డీలక్స్‌ వంటి మేలిమి రకాల మిరపకాయలకు మంచి డిమాండ్‌ వస్తోన్నది. మిర్చి కొనుగోళ్లలో ఇదే ఊపు కొనసాగితే క్వింటాల్‌ రూ.25 వేలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెప్తున్నారు. యార్డుకు గురువారం 87,867 టిక్కీలు రాగా. నిల్వ ఉన్న వాటితో కలిపి 86,466 టిక్కీలను ట్రేడర్లు కొనుగోలు చేశారు. ఇంకా 48,898 టిక్కీలు నిల్వ ఉన్నాయి. గురువారం యార్డులో నాన్‌ ఏసీ కామన్‌ వెరైటీలు క్వింటాల్‌కు కనిష్ఠంగా రూ.7,000, గరిష్ఠంగా రూ.19,500, నాన్‌ ఏసీ స్పెషల్‌ వెరైటీలకు రూ.7,000, రూ.20,000, నాన్‌ ఏసీ తెల్లకాయలకు రూ.4,000, రూ.9,500, ఏసీ కామన్‌ వెరైటీకి రూ.7,000, రూ.18,500, ఏసీ స్పెషల్‌ వెరైటీకి రూ.7,000, రూ.17,700, ఏసీ తెల్లకాయలకు రూ.5,500, రూ.9,500 ధర లభించినట్లు యార్డు సెక్రటరి ఐ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)