లతా మంగేష్కర్‌ కన్నుమూత !

Telugu Lo Computer
0


ప్రముఖ గాయని, గానకోకిల లత మంగేష్కర్ (92) ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనేక భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. పండిట్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌, షీవంతి దంపతులకు 1929 సెప్టెంబర్‌ 28న లతామంగేష్కర్‌ జన్మించారు. తల్లిదండ్రులు తొలుత ఆమెకు హేమ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత లతగా నామకరణం చేశారు. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్‌, హృదయనాథ్‌ మంగేష్కర్‌, మీనా కదికర్‌లు లత మంగేష్కర్‌కు తోబుట్టువులు. తండ్రి వద్దే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత ఐదేళ్ల వయసులో ఆలపించటం మొదలు పెట్టారు. లత పాఠశాలకు వెళ్లలేదు. ఒక రోజు తన సోదరి ఆశాను తీసుకుని పాఠశాలకు వెళ్లగా, ఉపాధ్యాయులు అనుమతించలేదు. అదే ఆమె పాఠశాలకు వెళ్లిన, మొదటి చివరి రోజు కావటం గమనార్హం. ఆపై సంగీత సాధన మొదలు పెట్టిన ఆమె తండ్రి మరణంతో నటిగా మారాల్సి వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)