మధ్యప్రదేశ్‌లో జన్మించిన శివమ్ సోనీ. బి.టెక్. చదువును సగంలోనే ఆపేసిన శివమ్ ఓ హోటల్ నడిపే వాడు. సొరియాసీస్ అనే చర్మవ్యాధి బారినపడ్డాడు. దీనితో వ్యాపారం దెబ్బతింది. తన రెస్టారెంట్‌ను మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్థికంగా భారీ నష్టాన్ని చవిచూశాడు. రూ.18 లక్షల వరకూ అప్పులపాలై ఇక ఆత్మహత్యే శరణ్యమని అనుకున్నాడు. జీవితంతో పోరాడలేక ఒక చీటీ రాసి ఇంటి నుంచి పారిపోయాడు. దిక్కుతోచని స్థితిలో ఇండోర్‌కు వెళ్లిపోయాడు. ఖాళీ కడుపుతో చాలా కాలం గడిపాడు. సగం కడుపు నింపుకొని బతుకెళ్లదీశాడు. అప్పుడు తెలిసింది ఆకలి బాధేంటో…! కడుపుకు భోజనం దొరికితే మనిషి ఎన్నికష్టాలను ఓర్చుకునైనా బతుకుతాడని, జీవితంపైన ఆశ చచ్చిపోకుండా పోరాడతాడని అర్థం చేసుకున్నాడు. అందులో నుండే హంగర్ లంగర్ ఉద్భవించింది. కష్టాల నుండి ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకున్న శివమ్ తనకొచ్చిన విద్యనే మొదలుపెట్టాడు. చిన్నగా ఎదిగాడు ఇండోర్‌లో తల దాచుకోడానికి వచ్చిన శివమ్ ఇప్పుడు ఆకలితో ఉన్న వారికి రూ. 10కే భోజనం అందిస్తున్నాడు. అంత డబ్బు కూడా చెల్లించలేని వారికి ఉచితంగానే భోజనం పెడతాడు. ఒకప్పుడు ఆకలేసిన ప్రతిసారీ భోజనం దొరుకుతుందేమోనని వెంపర్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎంతో మందికి అతితక్కువ ధరతో ఆహారం అందిస్తున్నాడు. ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తున్నావ్? అని ఎవరైనా అడిగితే… తనలాంటి కష్టం ఇంకెవరూ పడకూడదనే ఇలా చేస్తున్నానంటాడు. ఇండోర్‌లో శివమ్ సోనీ హంగర్ లంగర్ చాలా ఫేమస్. అన్నం తిన్నవారు శివమ్‌ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళతారు.