మార్చి నాటికి కరోనా ఎండమిక్ దశ?
January 20, 2022
0
దేశంలో కరోనా మహమ్మారి మార్చి నాటికి ఎండమిక్ దశకు చేరుకుంటుందని ఐసీఎంఆర్‌లో వ్యాధుల నివారణ విభాగం చీఫ్ సమీరన్ పాండా చెప్పారు. ఎండమిక్ దశ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా ఉధృతి కనపడకుండా అక్కడక్కడా విసిరేసినట్లు కొద్ది ప్రదేశాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కరోనా సాధారణ వైరస్‌గా మారిపోయి ప్రజలు దానితో సహజీవనం చేసే పరిస్థితికి చేరుకోవడం. ప్రజలందరూ కోవిడ్ రక్షణ కవచాలైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేస్తూ ఉంటే, కొత్త వేరియంట్లు ఏవీ పుట్టుకొని రాకపోతే కరోనా ఇక తుది దశకు చేరుకున్నట్టేనని అన్నారు. కరోనా ఎండమిక్ దశ మార్చి 11 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ''డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమిస్తే కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్టే. డిసెంబర్ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్ వేవ్ మూడు నెలల్లో ముగిసిపోతుంది'' అని ఐసీఎంఆర్ నిపుణుల బృందం గణిత శాస్త్ర విధానం ఆధారంగా రూపొందించిన అంచనాల్లో వెల్లడైందని పాండా తెలిపారు. ''మార్చి 11 నుంచి కరోనా ఉధృతి తగ్గిపోతుంది. ఢిల్లీ, ముంబైలలో కోవిడ్-19 కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయో లేదో తెలియాలంటే మరి రెండు, మూడు వారాలు వేచిచూడాలి. ఆ రెండు నగరాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ అక్కడ కరోనా పరిస్థితి ఏ దశలో ఉందో ఇప్పుడే చెప్పలేము. ఒకట్రెండు రోజుల్లో అక్కడ పరిస్థితులపై ఒక అంచనాకి రాలేము. ప్రస్తుతానికి ఒమిక్రాన్, డెల్టా కేసులు అక్కడ 80:20 నిష్పత్తిలో నమోదవుతున్నాయి'' అని పాండా వివరించారు.