హెలికాప్టర్ ప్రమాదంలో గాయాలపాలై చికిత్స పొందుతోన్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. బెంగళూరు కమాండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. డిసెంబర్ 8న మధ్యాహ్నం తమిళనాడు సూలూర్ ఎయిర్‌బేస్ నుంచి వెల్లింగ్టన్లోని సైనిక కళాశాలకు సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులు సహా మరో 11 మంది అధికారులు వెళుతున్న క్రమంలో కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో రావత్ దంపతులు సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను బెంగళూరు తరలించి చికిత్స అందించారు. అయితే మృత్యువుతో పోరాడి ఆయన కూడా కన్నుమూశారు. వరుణ్ సింగ్ తండ్రి.. ఏఏడీ(ఆర్మీ ఎయిర్ డిఫెన్స్)లో విధులు నిర్వహించారు. వరుణ్ సోదరుడు తనూజ్.. ప్రస్తుతం నేవీలో లెఫ్టినెంట్ కమాండర్. వరుణ్ ఇప్పటికే ఓసారి మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్‌లో.. ఆయన నడుపుతున్న తేజస్ విమానంలో గాలిలో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో వరుణ్.. విమానం నుంచి దూకేందుకు ఆస్కారం ఉంది. అయినప్పటికీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ, సమయస్ఫూర్తితో విమానాన్ని నడిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని విమానాన్ని సురక్షితంగా నేలకు తీసుకొచ్చారు. వరుణ్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయన్ని శౌర్య చక్రతో సత్కరించింది.
కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి
December 15, 2021
0