హైదరాబాద్‌లోని కాంటినెంటల్ హాస్పిటల్స్ మళ్లీ దాని వ్యవస్థాపకులైన డాక్టర్ గురునాథరెడ్డి అజమాయిషీ కిందకు వచ్చింది. ఈ ఆసుపత్రిలో మలేషియాకు చెందిన ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ బెర్హాద్‌కు మెజార్టీ వాటా ఉన్న విషయం విదితమే. తాజాగా ఈ సంస్థ తన వాటా మొత్తాన్ని విక్రయించింది. కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో ఇప్పటివరకు దాని వ్యవస్థాపకుడైన డాక్టర్ గురునాథరెడ్డికి 28 శాతం, ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ అనుబంధ సంస్థ అయిన గ్లెనేగల్స్ డెవలప్‌మెంట్ పీటీఈ లిమిటెడ్‌కు 62 శాతం వాటా ఉన్నాయి. ఈ వాటా మొత్తాన్ని విక్రయించినట్లు ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ వెల్లడించింది. పెట్టుబడుల సమీక్ష, పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఐహెచ్‌హెచ్ వాటా మొత్తాన్ని డాక్టర్ గురునాథరెడ్డి, తన మిత్రులు, కొన్ని సంస్థలతో కలిసి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కాంటినెంటల్ హాస్పిటల్స్ మళ్లీ గురునాధరెడ్డి అజమాయిషీ కిందకు వచ్చినట్లు అవుతోంది. ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ 2015లో దాదాపు రూ.282 కోట్లు చెల్లించి కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు చేసింది. తర్వాత నెమ్మదిగా తన వాటాను పెంచుకుంటూ, 62 శాతానికి చేరింది. ఈ వాటాను తిరిగి తీసుకునేందుకు డాక్టర్ గురునాథరెడ్డి ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ వచ్చారు. స్థానికంగా ఉన్న అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల యాజమాన్యాలతో కలిసి నిధులు సమీకరించి ఐహెచ్‌హెచ్ హెల్త్‌కేర్ వద్ద ఉన్న వాటా కొనుగోలు చేసేందుకు కసరత్తు చేసినా, ఫలించలేదు. ఎట్టకేలకు ఆశించిన విధంగా తాజాగా ఈ వాటాను ఆయన దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
కాంటినెంటల్ హాస్పిటల్స్‌ని దక్కించుకున్న డాక్టర్ గురునాథరెడ్డి
December 15, 2021
0
Tags