భార్య అనుమతి లేకుండా ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం !

Telugu Lo Computer
0


భార్యే కదా అని ఆమె ఫోన్లు రికార్డు చేస్తున్నారా ?. ఆమె వేధిస్తోందని నిరూపించడానికి ఫోన్ కాల్స్ రికార్డింగ్ మోడ్‌లో పెట్టారా ? అయితే తక్షణం మనసు మార్చుకోండి. ఎందుకంటే భార్య అయినా సరే ఆమె అనుమతి లేకుండా ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం. అనుమతి లేకుండా భార్య కాల్‌ని రికార్డ్ చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమే. ఈ విషయాన్ని పంజాబ్- హర్యానా హైకోర్టు తేల్చిచెప్పింది. పంజాబ్‌లోని భటిండాలో ఓ వ్యక్తి తన భార్య వేధిస్తోందని విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. వేధింపులకు సాక్ష్యంగా ఫోన్ కాల్స్ రికార్డింగ్‌లను సమర్పించాడు. ఈ ఫోన్ రికార్డింగ్‌లను ఫ్యామిలీ కోర్టు సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు అనుమతి లేకుండా కాల్స్ రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని తేల్చింది. అందుకే కింది కోర్టు సాక్ష్యంగా పరిగణనలోకి తీసుకున్న కాల్ రికార్డింగ్స్ నిర్ణయాన్ని తోసి పుచ్చింది. అనుమతి లేకుండా జీవిత భాగస్వామితో ఫోన్ సంభాషణను రికార్డ్ చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించినట్లు అవుతుంది. ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. తన భార్యపై నెగిటివ్ ఇమేజ్ చూపించేందుకు ఆమె అనుమతి లేకుండా కాల్స్ రికార్డ్ చేయడం హక్కులకు భంగం కలిగించడమేనని పంజాబ్, హర్యానా హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)