దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న సమయంలో జైళ్లలో ఉన్న ఖైదీలను పెరోల్‌పై తాత్కాలికంగా విడుదల చేసేందుకు ఉన్న అవకాశాలను న్యాయస్థానాలు పరిశీలిస్తున్నాయి. దీంతో ఇప్పటికే చాలా మంది బెయిల్ పొందలేని ఖైదీలు పెరోల్‌పై విడుదలవుతున్నారు.
కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లోని కొందరు ఖైదీలు మాత్రం తమకు పెరోల్ వద్దని అధికారులను వేడుకుంటున్నారు. ఇలా ఇప్పటివరకు 21 మంది ఖైదీలు తమ పెరోల్ వద్దని అభ్యర్థించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ జైళ్లశాఖ డీజీ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ నగర్, మీరట్, మహారాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, లఖ్‌నవూ జైళ్లనుంచి 21 మంది ఖైదీలు తాము జైళ్లలోనే సురక్షితంగా ఉన్నామని, పెరోల్‌పై విడుదల చేయవద్దని అభ్యర్థించినట్లు తెలిపారు.
మూడు నెలలపాటు పెరోల్‌పై విడుదల అయితే .. అదే కాలాన్ని శిక్ష పడిన కాలానికి అదనంగా కలుపడం ఒక కారణమైతే.. పెరోల్‌పై బయటకు వెళితే వారికి సరైన ఆహారం, వైద్య సదుపాయాలు లభించకపోవచ్చని ఖైదీలు అభిప్రాయపడుతున్నారు. అవసరమైన వైద్య పరీక్షలు, సమయానికి ఆహారం లభించడంతో జైళ్లలోనే సురక్షితంగా భావిస్తున్నట్లు ఖైదీలు తెలిపినట్లు జైళ్లశాఖ అధికారులు వెల్లడించారు. వీటికి అధికారులు ఎలా స్పందించారు అన్న ప్రశ్నకు.. ఖైదీలు లిఖితపూర్వకంగా ఇచ్చిన అభ్యర్థనను తప్పకుండా గౌరవిస్తామని.. వారు కోరినట్లే ఇక్కడే ఉంచుతామని యూపీ జైళ్లశాఖ డీజీ పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటివరకు దాదాపు 9వేల ఖైదీలకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు బెయిల్ పొందని 2200 మంది ఖైదీలను పెరోల్‌పై విడుదల చేశామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల మేరకు వీరిని విడుదల చేశామని పేర్కొన్నారు.