కెన్యా ప్రతిపక్ష నాయకుడు, మాజీ ప్రధానమంత్రి రైలా ఒడింగా ఆయుర్వేద చికిత్స కోసం కేరళకు వచ్చి అకస్మాత్తుగా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇటీవలె కేరళకు వచ్చిన రైలా ఒడింగా బుధవారం ఉదయం వాకింగ్ చేస్తుండగా, గుండెపోటు రావడంతో కుప్పకూలి మరణించారు. 80 ఏళ్ల రైలా ఒడింగాకు ఆయుర్వేద వైద్యం అంటే నమ్మకం ఎక్కువ. గతంలో తన కుమార్తె చూపు సమస్యతో బాధపడగా, ఆమెకు కేరళలో ఆయుర్వేద వైద్యం చేయించారు. దీంతో ఆమెకు ఉన్న దృష్టి సమస్య తీరిపోవడంతో ఆయుర్వేదంపై ఇష్టం పెంచుకున్నారని ఆయన ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితమే మళ్లీ ఆయుర్వేద వైద్యం కోసం కేరళకు రాగా ఈ విషాదం చోటు చేసుకుంది. కేరళలోని కొట్టాట్టకుళం ఆయుర్వేద కేంద్రానికి ఇటీవలె రైలా ఒడింగా కుటుంబంతో సహా వచ్చారు. ఆయన భార్య, కుమార్తెతో కలిసి వచ్చిన రైలా ఒడింగా బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆయనను సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే గుండెపోటు కారణంగా ఆయన అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఆయన మరణానికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి అధికారులు ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆయన పార్థీవదేహాన్ని అదే ప్రైవేట్ ఆసపత్రిలో ఉంచారు.
రైలా ఒడింగా మరణవార్త తెలుసుకుని ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ప్రియ మిత్రుడు.. కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా మరణవార్త విని తాను చాలా బాధపడినట్లు ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. రైలా ఒడింగా ఒక గొప్ప రాజనీతిజ్ఞుడని.. మన దేశానికి ప్రియమైన మిత్రుడని కొనియాడారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉందని, భారతదేశం అన్నా, భారత సంస్కృతి, విలువలు, ప్రాచీన జ్ఞానంపై ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. ఆయుర్వేద చికిత్సతో తన కుమార్తె జబ్బు నయం కావడంతో ఆయన ఆయుర్వేదం, సాంప్రదాయ వైద్యంపై ఇష్టం పెంచుకున్నారని తెలిపారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు, కెన్యా ప్రజలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మోడీ ట్వీట్ చేశారు.