అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై వంద శాతం భారీ సుంకాలను విధించిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలుస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి పేర్కొంది. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ అమెరికా సుంకాలు భారత వృద్ధిపై తక్కువ ప్రభావం చూపాయని నివేదిక వెల్లడించింది. తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ ప్రకారం, ఐఎంఎఫ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.4 శాతం నుండి 6.6 శాతానికి పెంచింది. ఇది దేశ బలమైన దేశీయ డిమాండ్, స్థిరమైన పెట్టుబడులు, రాబస్ట్ సేవా రంగం కారణంగా సాధ్యమైందని తెలిపింది. 2025 మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతానికి చేరుకోవడం ద్వారా.. ఐదు త్రైమాసికాల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. దేశీయ వినియోగం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు ఈ వృద్ధికి ప్రధాన కారకాలుగా చెప్పుకోవచ్చు. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల ప్రభావం కొంతవరకు ఉన్నప్పటికీ, దేశీయ మార్కెట్ బలం దానిని సమతుల్యం చేసింది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. అదే సమయంలో, ప్రపంచ బ్యాంకు కూడా అక్టోబర్‌లో విడుదల చేసిన నివేదికలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 6.3 శాతం నుండి 6.5 శాతానికి పెంచింది. ఇదిలా ఉంటే అమెరికా ఆర్థిక వ్యవస్థపై సుంకాల ప్రభావం ప్రతికూలంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. జీడీపీ వృద్ధి రేటు 2025లో 1.9శాతం, 2026లో 1.7 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా మిత్రదేశాలపై కూడా భారమయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. యూరప్‌లోని అభివృద్ధి చెందిన దేశాల వృద్ధి కూడా మందగించనుందని ఐఎంఎఫ్ పేర్కొంది. యూరో జోన్ వృద్ధి రేటు 2025లో 1.2 శాతం, 2026లో 0.7 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉంది. బ్రిటన్ కూడా ఇలాంటి స్థాయిలో వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా. చైనా విషయానికి వస్తే ఐఎంఎఫ్ చైనా వృద్ధి రేటును 2025లో 4.9 శాతం, 2026లో 4.5 శాతంగా అంచనా వేసింది. గత ఏడాది 5 శాతం వృద్ధి సాధించిన చైనా ప్రస్తుతం రియల్ ఎస్టేట్ సంక్షోభం, డిమాండ్ మందగింపు, ఎగుమతుల తగ్గుదల వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఐఎంఎఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ వృద్ధి 2024లో 3.3 శాతం నుండి 2025లో 3.2 శాతం, 2026లో 3.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తోంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థల వృద్ధి కూడా 2024లో 4.3 శాతం నుండి 2026లో 4 శాతానికి తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఐఎంఎఫ్ విశ్లేషకులు చెబుతున్నట్లుగా భారత్ లాంటి దేశాలు తమ దేశీయ డిమాండ్, టెక్నాలజీ రంగం, సేవల ఎగుమతుల వల్ల గ్లోబల్ వృద్ధికి ప్రధాన ఆధారంగా ఉంటాయి. అమెరికా సుంకాల వల్ల తాత్కాలిక ప్రభావం ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో స్థిరంగా ఉండబోతోందని ఐఎంఎఫ్ నమ్మకం వ్యక్తం చేసింది.
భారీ సుంకాలు విధించిన తర్వాత కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలుస్తోంది : ఐఎంఎఫ్
October 16, 2025
0
Tags