ఆఫ్ఘనిస్తాన్ తో ఉన్న అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటన చేసింది. ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు తీవ్రతరమైన నేపథ్యంలో పాక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఓ వార్తా సంస్థ కార్యక్రమంలో మాట్లాడిన పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొందని, శత్రుత్వం ముదిరిందని స్పష్టం చేశారు. "ఇప్పటికిప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో మాకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధాలు లేవు" అని ఆయన తేల్చిచెప్పారు. బెదిరింపులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సరైంది కాదని, ఉగ్రవాద ముప్పుపై చర్యలు తీసుకున్న తర్వాతే చర్చలకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమ సైన్యం జరిపిన దాడులను ఆసిఫ్ పూర్తిగా సమర్థించారు. తమపై జరిగిన దాడికి ప్రతిదాడి చేయడం సహజమని అన్నారు. తాము సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఉగ్రవాదుల రహస్య స్థావరాలపైనే దాడులు చేశామని వివరించారు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై నుంచి తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ) లాంటి అనేక ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాము లక్ష్యంగా చేసుకున్న టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహసూద్ వారి భూభాగంలోనే ఉన్నారని ఆసిఫ్ స్పష్టం చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ తో అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటన
October 14, 2025
0
Tags