హైదరాబాద్ లో మెట్రో రైళ్లను నడపడం కష్టంగా ఉంది : కేంద్రానికి లేఖ రాసిన ఎల్‌అండ్‌టీ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరంలోని మూడు కారిడార్‌లలో పబ్లిక్, ప్రైవేట్‌ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నిర్మించిన మెట్రోను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎల్అండ్ టీ తెలిపింది. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ని ఏర్పాటు చేసి అప్పగించాలని చెప్పినా అందుకు కూడా తాము సిద్ధమని తెలిపింది. ఆర్థికంగా భారంగా మారిన మెట్రో రైల్‌ నిర్వహణ ఇక తమ వల్ల కాదంటూ ఎల్అండ్ టీ స్పష్టం చేసింది. గత కొన్నాళ్లుగా వరుసగా నష్టాలు రావడం, భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్ ఉండటం వల్ల మెట్రో రైళ్లను నడపడం కష్టంగా ఉందని, కొన్ని రోజుల క్రితమే ఎల్అండ్ టీ కేంద్రానికి లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రో దేశంలోనే పీపీపీ పద్ధతిలో నిర్మించిన తొలి మెట్రో కావడం గమనార్హం. హైదరాబాద్‌ మెట్రో మొదటి దశ 2017లో ప్రారంభమైంది. 69 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో మార్గాన్ని సుమారు రూ.22 వేల కోట్లతో నిర్మించారు. ఫస్ట్ పేజ్‌లో ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు పెండింగ్‌లో ఉంది. అయితే దీన్ని ప్రస్తుతం చాంద్రాయణగుట్ట వరకు పొడిగించి 2వ దశలో కలిపారు మొదటి కారిడార్‌ పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎల్‌అండ్‌టీకి రూ. 3,756 కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అవి 2020 నాటికి ఇది కాస్త రూ.5 వేల కోట్లకు పెరిగింది. మరోవైపు వీజీఎఫ్‌ కింద ఇవ్వాల్సిన రూ.254 కోట్లను కేంద్రం ఇంకా ఇవ్వలేదని ఎల్ అండ్ టీ చెప్పుకొచ్చింది. వీటి విడుదలలో జాప్యం వల్ల తమకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది కలుగుతుందని తెలిపింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఆలస్యం అవుతున్నాయి. ఇటు టికెట్‌లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు చాలడం లేదు. దీంతో మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు నిర్మాణ కంపెనీ వెల్లడించింది. విద్యుత్ చార్జీలు, ఉద్యోగుల జీతాలు, నిర్వహణ ఖర్చులు, ఇతరాత్ర ఖర్చులన్ని కలిసి ఆర్థికంగా భారంగా మారిందని ఎల్అండ్‌టీ లేఖలో చెప్పుకొచ్చింది. దీంతో మెట్రో తొలి దశలోని తమ ఈక్విటీ వాటాను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అమ్మేందుకు రెడీగా ఉన్నామని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం మెట్రోలో ప్రతి రోజు 4.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)