తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గురుకులాల్లో పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గురుకులాల్లో విద్యార్థులు విషజ్వరాలు, పాముకాట్లు, ఎలుక కాట్లు, కుక్కకాట్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి కారణాలతో ఆసుపత్రుల పాలవడం, ప్రాణాలు కోల్పోవడం వంటి దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. అదే విధంగా, గురుకులాల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఆడంబర ప్రకటనలు చేసే ముందు, వారికి సకాలంలో జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రిని ఆయన కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన హామీలు వాస్తవంలో నీటి మూటలయ్యాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే పంపిస్తామని ఇచ్చిన ప్రకటనలు కూడా అమలు కావడంలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యావ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఆ సమయంలో 294 గురుకులాలను 1,024కి పెంచిన ఘనత కేసీఆర్ ది అని హరీష్ రావు గుర్తుచేశారు. అలాగే, విద్యార్థుల సంఖ్యను 1.90 లక్షల నుంచి 6.5 లక్షలకు పెంచి నాణ్యమైన విద్యను అందించారని చెప్పారు. కానీ కాంగ్రెస్ పాలనలో 22 నెలల్లోనే గురుకులాల ఖ్యాతి అధఃపాతాళానికి దిగజారిందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి గురుకులాలపై చిన్న చూపు చూపడం ఆపాలని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని, గురుకుల విద్యా వ్యవస్థకు శ్రద్ధ వహించాలని ఆయన కోరారు.
రోజురోజుకూ అధ్వానంగా మారుతున్న గురుకులాల పరిస్థితి
September 07, 2025
0
Tags