ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రిక్వెస్ట్‌కు నో చెప్పిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ !

Telugu Lo Computer
0


బెంగళూరు విప్రో క్యాంపస్ నుంచి పరిమితి సంఖ్యలో వాహనాలను అనుమతించాలన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన అభ్యర్థనను ఆ సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తిరస్కరించారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్య నుంచి కొంత ఉపశమనం కలిగించేలా పరిమిత సంఖ్యలో వాహనాలను విప్రో క్యాంపస్ మీదుగా వెళ్లేందుకు అనుమతించాలని సీఎం సిద్ధరామయ్య లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై ప్రేమ్‌జీ స్పందిస్తూ సర్జాపూర్ క్యాంపస్‌లో నుంచి ప్రజా వాహనాలను అనుమతించలేమని పేర్కొన్నారు. అయితే, బెంగళూరు ట్రాఫిక్ సమస్య తీవ్రతను గుర్తించిన ఆయన ఈ విషయంలో కార్పొరేట్ సహకారం కోసం సీఎం సిద్దరామయ్య చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. సర్జాపూర్ క్యాంపస్ ప్రత్యేక ఆర్ధిక మండలిగా గుర్తింపు పొందిందని, అంతర్జాతీయ సేవల బాధ్యతల కారణంగా కఠినమైన ప్రవేశ నియంత్రణ నియమాలకు లోబడి ఉంటుందని విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ అన్నారు. ''మా సర్జాపూర్‌ క్యాంపస్‌ నుంచి ప్రజా వాహనాల రాకపోకలను అనుమతించాలనే ప్రత్యేక సూచన విషయంలో చట్టపరమైన, పాలనాపరమైన, అధికారపరమైన సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని భావిస్తున్నాం.. ఎందుకంటే ఇది ఒక లిస్టెడ్‌ కంపెనీకి చెందిన ప్రత్యేక ప్రైవేట్‌ ఆస్తి మాత్రమే, ప్రజా రవాణా కోసం ఉద్దేశించింది కాదు'' అని తెలిపారు. అంతేకాదు ''మా సర్జాపూర్‌ క్యాంపస్‌ ఒక ప్రత్యేక ఆర్థిక మండలిగా ఉండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు సేవలు అందిస్తోంది అన్న విషయాన్ని కూడా గమనించాలి.. మా ఒప్పంద నిబంధనలు ప్రవేశ నియంత్రణ ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచిస్తున్నాయి.. అంతేకాకుండా ప్రైవేట్‌ ఆస్తి గుండా ప్రజా వాహన రాకపోకలు అనుమతించడం దీర్ఘకాలిక, స్థిరమైన పరిష్కారం కాదు'' అని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. బెంగళూరులో ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్‌ (ఓఆర్ఆర్)లోని ఇబ్లూర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ దారుణంగా ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ రద్దీ వల్ల ప్రజల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా.. ఉత్పాదకత, జీవనప్రమాణ నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతోందని సిద్ధూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధికి, సామాజిక ప్రగతికి విప్రో సంస్థ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు విప్రో సహకారం అవసరమని ఆయన అజీమ్ ప్రేమ్‌జీకి రాసిన లేఖలో తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)