ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో కట్టుకున్న భర్తపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వివాహితను ఓ సీఐ ఏకంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీకి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడు. దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ తరచూ రాకపోకలు సాగిస్తుంటారు. అయితే 2018లో అతనికి కలికిరి ప్రాంతానికి చెందిన ఓ యవతితో పెళ్లి అయింది. అనంతరం కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె మదనపల్లి డీఎస్పీ ఆఫీసును ఆశ్రయించింది. ఈ క్రమంలో సదరు వివాహితతో సీఐ సురేష్ కుమార్ పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెకు మాయమాటలు చెప్పి మాయలో పడేసిన సురేష్ ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే తన భార్యకు సీఐ సురేష్ తో పెళ్లైన విషయాన్ని 2021లో పవన్ కుమార్ కు తెలిసింది. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 2023లో ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. దీంతో పవన్ కుమార్ 2023లో హైకోర్టును ఆశ్రయించి సదరు సీఐపై ప్రైవేట్ కేసు వేయించారు. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా ఎలాంటి ఛార్జిషీటు వేయలేదు. దీంతో పోలీసులపై విసిగి వేసారిన బాధితుడు చివరికి పీఎంవోకు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి డీజీపీ కార్యాలయానికి సమాచారం రావడం, ఉన్నతాధికారుల ఆదేశాలతో మదనపల్లె పోలీసులు 2025 జూన్ లో సురేష్ పై కేసు నమోదు చేశారు. సదరు సీఐ సురేష్ తల్లిదండ్రులు కులాంతర వివాహం చేసుకున్నారని, కానీ తల్లి కులం ఆధారంగా అతను ఉద్యోగంలో చేరినట్లుగా బాధితుడు సురేష్ పీఎంవోకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అతని కుల ధ్రువీకరణ పైనా కడప జిల్లా రెవెన్యూ అధికారులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు, కుల ధ్రువీకరణపై విచారణ నేపథ్యంలో సీఐ సెలవుపై వెళ్లారు.
భర్తపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళను రెండో పెళ్లి చేసుకున్న సీఐ
August 22, 2025
0
Tags