కేంద్రం ప్రభుత్వం కర్ణాటకపై వివక్ష చూపుతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ నిధుల పంపిణీలో చిన్నచూపు చూస్తోందన్నారు. అందుకే తమ ప్రభుత్వం సొంతగా అభివృద్ధి మోడళ్లను అనుసరిస్తోందన్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీ స్కీమ్‌లు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఫిలేమన్ యాంగ్ స్వయంగా ఇక్కడకు వచ్చి పథకాలను పరిశీలించారని గుర్తు చేశారు. కేంద్ర సంస్థలైన ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం, ఈడీ, సీబీఐ ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా పనిచేయడంలేదని సిద్ధరామయ్య విమర్శించారు. ఈ విషయంపై బాధ్యతగల ప్రతి పౌరుడు తమ గొంతుక వినిపించాలన్నారు. దేశంలో 80 శాతం సంపద కేవలం 10 శాతం వ్యక్తుల గుప్పిట్లో ఉందని చాలా సంస్థల సర్వేలు వెల్లడిస్తున్నాయని సిద్ధరామయ్య గుర్తు చేశారు. వారు సమష్టిగా జీఎస్టీకి అందిస్తున్న మొత్తం మూడు శాతం మాత్రమేనని విమర్శించారు. సాధారణ ప్రజలు 97 శాతం సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. తమ గ్యారంటీ పథకాలు రాష్ట్ర ప్రజల ఆర్థిక చిత్రపటాన్ని మార్చేశాయన్నారు. కర్ణాటక నక్సల్ రహిత రాష్ట్రమని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా చేసేందుకు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రం ప్రభుత్వం కర్ణాటకపై వివక్ష చూపుతుంది !
August 15, 2025
0
Tags