గాజా పౌరులకు వీసాలు నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన అనేకమంది ప్రజలు చికిత్స కోసం యూఎస్‌కు వస్తున్నారని ట్రంప్ యంత్రాంగానికి ఫిర్యాదు అందడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాత్కాలిక వైద్య-మానవతా వీసాలను జారీ చేయడానికి ఉపయోగించే ప్రక్రియపై సమీక్ష నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా గాజా ప్రజలకు అన్ని రకాల వీసాలు నిలిపివేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ''గాజా నుంచి అమెరికాకు వచ్చే పాలస్తీనియన్లు హమాస్‌కు అనుకూలంగా ఉన్నారని, హమాస్‌కు నిధులు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు అందడంతో ఈ చర్యలు తీసుకున్నాం'' అని విదేశాంగ శాఖ తెలిపింది. గతవారం తీవ్రంగా గాయపడిన 11మంది పాలస్తీనియన్ చిన్నారులకు అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ 'హీల్ పాలస్తీనా' వైద్య చికిత్స కోసం యూఎస్‌కు చేరుకోవడానికి సహకరించిందని పేర్కొంది. ఈ విధంగా పెద్ద మొత్తంలో ప్రజలను తరలించడం సరైనచర్య కాదని పేర్కొంది. ట్రంప్ యంత్రాంగం తీసుకున్న నిర్ణయంపై పలు స్వచ్ఛంద సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యూఎస్-ఆధారిత స్వచ్ఛంద సంస్థ 'పాలస్తీనా చిల్డ్రన్స్ రిలీఫ్ ఫండ్' ఈ విషయంపై స్పందిస్తూ అమెరికా తీసుకున్న ఈ ప్రమాదకరమైన..అమానవీయ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. గత 30 ఏళ్లుగా తాము వేలాదిమంది పాలస్తీనా చిన్నారులను వైద్యం కోసం అమెరికాకు తరలించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడులు, ఆహార కొరత వల్ల వేలాదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతుంటే ఇలాంటి ఆంక్షలు ఎలా విధిస్తారని ప్రశ్నించింది.
హమాస్‌కు నిధులు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న మిషతో గాజా పౌరులకు వీసాలు నిలిపివేసిన అమెరికా
August 17, 2025
0
Tags