భారత ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50శాతం సుంకాలతో వ్యాపార వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఈ భారాన్ని ఎగుమతిదార్లు చెల్లించాలా, దిగుమతి సంస్థలు మోస్తాయా అన్నది తెలియని అయోమయం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా రిటైల్ వ్యాపార దిగ్గజాలు అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతానికి భారత్ నుంచి స్టాక్ దిగుమతులను నిలిపివేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులపై ఎగుమతులను నిలిపివేయాలని కోరుతూ అమెరికా వ్యాపార సంస్థలు భారత టోకు వర్తకులకు లేఖలు, మెయిల్స్ పంపినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. వాల్‌మార్ట్, అమెజాన్, టార్గెన్, గ్యాప్ వంటి సంస్థలు ఈ సందేశాలు పంపినట్లు తెలుస్తోంది. సుంకాల పెంపుతో ఉత్పత్తులపై పడే అదనపు భారాన్ని మోసేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా లేరని సమాచారం. ఆ ఖర్చును ఎగుమతిదారులే భరించాలని ఆయా సంస్థలు డిమాండ్ చేస్తున్నట్లు ఆ కథనాలు తెలిపాయి. ట్రంప్ సుంకాల పెంపుతో అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు దాదాపు 30 నుంచి 35శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీంతో కొనుగోళ్లు ఆగిపోతే మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40-50 శాతం తగ్గే అవకాశం ఉందని వస్త్ర పరిశ్రమ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా ఆయా రంగాలకు 4-5 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లనుంది. భారత్‌లో వెల్‌స్పన్ లివింగ్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఇండోకౌంట్, ట్రైడెంట్ వంటి ప్రధాన టెక్స్‌టైల్ ఎగుమతిదారు సంస్థలు తమ విక్రయాల్లో 40-70శాతం అమెరికాకే పంపిస్తున్నాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో తమకు అగ్రరాజ్యం నుంచి వచ్చే ఆర్డర్లు తగ్గుతాయని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటివరకు భారతీయ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులకు అమెరికా అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి ఈ రంగంలో 36.61 బిలియన్ డాలర్ల ఎగుమతులు వెళ్లగా.. ఇందులో 28 శాతం అమెరికాకే చేరాయి. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై 20శాతం టారిఫ్‌లు ఉన్నందున.. అమెరికా సంస్థలు టెక్స్‌టైల్ ఉత్పత్తుల కోసం ప్రత్యామ్నాయాలు ఆలోచించే అవకాశం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో భారత్‌పై ట్రంప్ సుంకాల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 25శాతం సుంకాలను విధించిన ఆయన.. ఇటీవల దాన్ని 50శాతానికి పెంచారు. గతంలో ప్రకటించిన 25శాతం టారిఫ్‌లు ఆగస్టు 7 నుంచి అమల్లోకి రాగా అదనపు సుంకాలు ఈనెల 27 నుంచి అమలుచేస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ టారిఫ్‌ల ప్రభావంతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది.
భారత్ నుంచి స్టాక్ దిగుమతులను నిలిపివేయనున్న అమెరికా రిటైల్ వ్యాపార దిగ్గజాలు ?
August 08, 2025
0
Tags