ఆంధ్రప్రదేశ్ లో బీసీ యువతకు జన ఔషధి స్టోర్లు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో జన ఔషధి స్టోర్లను బీసీ యువతకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. బీసీ కార్పొరేషన్‌ నుంచి పెద్దఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఏర్పాటుకు తక్షణమే అనుమతులివ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాల మెరుగుదల, ఆరోగ్య బీమాలో మార్పులు, కొత్త వైద్య కళాశాలలు, ఉచితంగా వైద్య పరీక్షలు, యోగా-నేచురోపతి అభివృద్ధి వంటి అంశాల్లో తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రతి మండలంలో జనరిక్‌ ఔషధాలు లభించేలా చూడాలన్న సీఎం ఆలోచనకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సూచించడంతో వాటికి వెంటనే ఆమోదం తెలిపారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద రూ.25 లక్షల వరకూ వైద్య బీమా అందించే అంశంపైనా చర్చించారు. ప్రస్తుత విధానం ద్వారా 1.43 కోట్ల కుటుంబాలకు లబ్ధి కలుగుతుండగా, 1.63 కోట్ల కుటుంబాలకు వర్తించేలా మార్పులు చేయాలని సీఎం సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మించేలా ప్రణాళిక అమలుచేయాలని సీఎం సూచించారు. మార్కాపురం, మదనపల్లి, పులివెందుల, ఆదోనిలో నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీల పురోగతిపై చర్చించారు. డబ్ల్యూహెచ్‌వో నిర్దేశాల ప్రకారం రాష్ట్రంలో మరో 12,756 పడకలు అందుబాటులోకి తేవాల్సి ఉందని, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. మూడు రీజనల్‌ స్టడీ సెంటర్లలో 64 మంది సభ్యుల నియామకానికి అనుమతులిచ్చారు. అమరావతి పరిధిలో నేచురోపతి యూనివర్సిటీ ఏర్పాటుకు యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందించేందుకు తలపెట్టిన ఉచిత వైద్య పరీక్షల పైలెట్‌ ప్రాజెక్టును కుప్పం నియోజకవర్గంలో 45 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 108 వాహనాల సిబ్బందికి యూనిఫామ్‌ అమలు చేయాలని నిర్దేశించారు. ఎన్టీఆర్‌ బేబీ కిట్స్‌ పథకాన్ని త్వరలోనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమీక్షలో భాగంగా పెర్కిన్స్‌ ఇండియా, ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌లు భాగస్వామ్యంతో అమరావతిలో మోడల్‌ ఇన్‌క్లూజివ్‌ సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చాయి. దీనిపై ఆ సంస్థల ప్రతినిధులు సీఎంను కలిసి ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సమగ్ర విద్య, సమాన హక్కులు, అందరికీ అందుబాటులో మౌలిక వసతులు సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. స్పందించిన సీఎం చంద్రబాబు సమగ్ర కార్యాచరణ ప్రణాళిలతో రావాలని సూచించారు. సమీక్షలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌, ప్రత్యేక సీఎస్‌ ఎం.టి.కృష్ణబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)