80 నకిలీ కేసులు, కోట్ల దందాలకు పాల్పడిన డాక్టర్‌ నమ్రత

Telugu Lo Computer
0


సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ఇప్పుడు క్లైమాక్స్‌ దశకు చేరుకుంది. గత వారం అరెస్టయిన ప్రధాన నిందితురాలు డాక్టర్‌ నమ్రత కస్టడీ ముగియడంతో, పోలీసులు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. మేజిస్ట్రేట్‌ ఆదేశాల మేరకు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నాలుగు రోజుల కస్టడీలో సృష్టి గ్యాంగ్‌ నుంచి పోలీసులు పలు కీలక సమాచారాన్ని రాబట్టారు. డాక్టర్‌ నమ్రత, విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్‌ కళ్యాణి, ఏజెంట్‌ సంతోషి - ఈ ముగ్గురినీ నార్త్‌జోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఒకేచోట ఉంచి ప్రశ్నించారు. మొదట్లో నిందితులు మౌనం వహించినా, పోలీసులు పక్కా ఆధారాలను చూపించిన తర్వాత చివరికి చేసిందంతా ఒప్పుకున్నారు. డాక్టర్‌ నమ్రత విచారణలో షాకింగ్ విషయాలను బయటపెట్టారు. దాదాపు 80 నకిలీ సరోగసీ కేసులను నిర్వహించినట్టు ఆమె అంగీకరించారు. ఒక్కో కేసులో 20 నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలిపారు. ఈ దందాలో సహకరించిన అనస్థీషియా డాక్టర్‌ సదానందం భారీ నజరానా తీసుకున్నాడని, సబ్‌ఏజెంట్లకు కూడా పెద్ద మొత్తంలో కమిషన్‌ ఇచ్చినట్టు నమ్రత కస్టడీలో వెల్లడించారు. అంతేకాక, అస్సాం, బీహార్, ముంబై, రాజస్థాన్‌ వంటి ప్రాంతాల నుంచి పసికందులను కొనుగోలు చేసి, చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారని ఆమె పోలీసులకు చెప్పింది. సృష్టి గ్యాంగ్ మోసపూరిత చర్యలతో నష్టపోయిన దంపతులు ఇప్పుడు పోలీసుల వద్దకు క్యూ కడుతున్నారు. తమ చికిత్స వివరాలు, డబ్బు బదిలీ రికార్డులు సమర్పిస్తూ ఫిర్యాదులు చేస్తున్నారు. సాక్షుల సంఖ్య పెరగడంతో, దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసులో 12 మంది అరెస్టయ్యారు, ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. సూత్రధారి డాక్టర్‌ నమ్రత ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉంది. కళ్యాణి, ధనశ్రీ సంతోషి కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)