గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న కాండోర్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. గాల్లోనే కుడివైపు ఇంజిన్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్‌తో ప్రమాదం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పెద్ద శబ్దం వినిపించింది. ఇది ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. 1500 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఈ విమానంలో 273 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. విమానం గ్రీస్‌లోని కోర్ఫు ద్వీపం మీదుగా వెళ్తుండగా, కిందినున్న పర్యాటకులు, స్థానికులు ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆకాశంలో మంటలు చెలరేగిన విమానాన్ని చూసి అందరూ ఆందోళన చెందారు. విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమై, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించారు. మొదట ఇంజిన్‌లో మంటలు ఆపడానికి ప్రయత్నించారు, కానీ మంటలు కొనసాగాయి. పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్లు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. కోర్ఫుకు తిరిగి వెళ్లే బదులు, ఇటలీలోని బ్రిండిసిలో అత్యవసరంగా ల్యాండ్ చేయాలని నిర్ణయించారు. ఒక ఇంజిన్‌తోనే విమానాన్ని సురక్షితంగా 8,000 అడుగుల ఎత్తులో బ్రిండిసి వైపు మళ్లించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు పైలట్లను అందరూ ప్రశంసించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత, అత్యవసర సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ప్రయాణికులను క్షేమంగా కిందకు దించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాండర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరి, మరుసటి రోజు వారికి జర్మనీకి ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సంఘటన విమాన సిబ్బంది చాకచక్యానికి, సరైన సమయంలో తీసుకున్న నిర్ణయానికి నిదర్శనంగా నిలిచింది.
గాల్లోనే పేలిన విమానం ఇంజిన్ : 273 మంది ప్రయాణికులు సురక్షితం : వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
August 18, 2025
0
Tags