ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో జులాయిగా తిరుగుతున్నావ్.. ఏదైనా పనిచేసుకోవచ్చుగా అని మందలించినందుకు తల్లిని కొడుకు గొంతు నులిమి చంపిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని ఓ షోరూమ్‌లో పనిచేస్తున్న శారద (45) అనే మహిళను ఆమె కుమారుడు ధనుష్ కుమార్ (22) మద్యం మత్తులో గొంతు నులిమి చంపినట్లు అలిపిరి ఎస్ఐ తెలిపారు. జులాయిగా తిరుగుతున్న కొడుకుకు పని చేసుకోవాలని తల్లి మందలించడమే ఈ దారుణానికి దారితీసింది. గురువారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంటర్ మధ్యలోనే ఆపేసి ఆవారాగా తిరుగుతున్న ధనుష్‌ను తల్లి శారద ఏదైనా పని చేసుకోవాలని, బాధ్యతాయుతంగా బతకాలని కోరింది. అయితే తన తప్పును తెలుసుకోని ధనుష్, తల్లిపై కోపం పెంచుకున్నాడు. అంతేకాకుండా ఆమెపై వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ధనుష్ కోపంతో శారద ముఖంపై బలంగా కొట్టాడు. దాంతో ఆమె కిందపడిపోగా ధనుష్ ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణం జరిగిన తర్వాత ధనుష్ శుక్రవారం తన అమ్మమ్మకు ఈ విషయాన్ని తెలియజేశాడు. దాంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి ధనుష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఏడాది క్రితం ధనుష్ తండ్రి కువైట్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
జులాయిగా తిరిగొద్దనందుకు తల్లిని గొంతు నులిమి చంపిన కొడుకు
July 19, 2025
0
Tags